అసెంబ్లీ ఏమన్నా స్పీకర్ తమ్మినేని జాగీరా?

దేశ మొదటి లోక్‌సభ స్పీకర్‌గా వ్యహరించిన జి.వి మౌలాంకర్, నీలం సంజీవరెడ్డి నుండి జి.ఎంసీ భాలయోగి వరకు, రాష్ట్రంలోనూ అనేక మంది స్పీకర్లుగా వ్యవహరించి ఆ స్థానానికీ ఉన్న ఔన్నత్యాన్ని, ప్రతిష్టను, గౌరవాన్ని కాపాడి ఇప్పటికీ ప్రశంసలు అందుకొంటున్న మహనీయులు వున్నారు. ప్రతిపక్షాల హక్కులు కాపాడే  పరిరక్షకునిగా మౌలాంకర్‌ని ప్రతిపక్షాలు అభివర్ణించాయి ఆంటే ఎంత సమన్వయంతో,భాధ్యతతో సభను హుందాగా నడిపారో అర్ధం అవుతుంది. రాష్ట్రంలోనూ అనేక మంది స్పీకర్లుగా భాధ్యతలు నిర్వహించారు, ఎవ్వరూ కూడా ఈ విధంగా ప్రతిపక్ష సభ్యులుపై అహంకారంతో, ఏక పక్షంగా, తీవ్ర పదజాలంతో దురుసుగా ప్రవర్తించలేదు. ప్రభుత్వం అభివృద్దికి దోహద పడేలా పార్లమెంటరీ విలువలు, సత్ సాంప్రదాయాలు వ్యవస్థీకృతం అయ్యేందుకు సభాపతులు భాధ్యతగా వ్యవహరించాలి అని కేంద్ర చట్ట సభ అధ్యక్షుడుగా పని చేసిన సర్ అబ్దుల్ రహీమ్ కొన్నేళ్ళ క్రితమే ఉద్భోదించారు. 

కానీ గతంలో సభాపతులుగా ఉన్నవారు ఎవ్వరూ ఇంత నేలబారుగా వ్యవహరించలేదే? స్పీకర్‌గా తమ్మినేని వ్యక్తిగా ఏదైనా మాట్లాడవచ్చు.కానీ రాజ్యాంగ బద్ద పదవిలో వుండి స్పీకర్‌గా ఏది పడితే అది మాట్లాడటం దారుణం. కౌల్ అండ్  షగ్దర్ పార్లమెంటరీ వ్యవస్థలో నిష్ణాతులు, వారి ఆలోచన ప్రకారం స్పీకర్ స్థానానికి వుండే ఔన్నత్యాన్ని, గౌరవాన్ని కాపాడాలి. స్పీకర్ ఇండిపెండెంట్, ఇంపార్షియల్, పోలిటికల్లీ న్యూట్రల్, రాజకీయ వివాదాలకు దూరంగా వుండాలి. గతంలో స్పీకర్లుగా వ్యహరించిన వారు ఈ విధంగా మాట్లాడి ఎరుగరు ఎంతో హు౦దాగా వ్యవహరించారు. కనీసం సభా మర్యాద పాటించకపోవడమే కాకుండా నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్షం తెలుగుదేశంపై కాలకూట విషం చిమ్ముతున్నారు. స్పీకర్‌ స్థానంలో ఉన్నవారు అంతకుముందు ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నవారు కావొచ్చు. అది కొత్తా కాదు. కానీ స్పీకర్‌ స్థానాన్ని స్వీకరించిన తరవాత నిష్పక్షపాతంగా వ్యవహరించే సంస్కారాన్ని అలవరచుకోకుండా  వికృతంగా విపక్షంపై విషం కక్కుతున్నారు. స్పీకర్ పదవి కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా స్పీకర్ తమ్మినేని వ్యవహరిస్తున్నారు. పంది ఎంత బలిసినా నంది కాదన్న సామెత వుంది. అట్లాగే అల్పులకు ఎటువంటి పదవి దక్కినా ఆ పదవికి గౌరవం దక్కనివ్వరు.


                   స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఏకపక్షంగా, భాధ్యత లేకుండా అసెంబ్లీ తన జాగీరు అన్నట్లు వ్యవహరిస్తూ ప్రతిపక్షంపై విషం కక్కడాన్ని భరించలేక శాసనసభను పూర్తిగా బహిష్కరించింది ప్రతిపక్షం తెలుగుదేశం. వర్షాకాలం సమావేశాల్లో రెండో రోజు కూడా టీడీపీ సభ్యుల డిమాండ్ పట్టించుకోకుండా స్పీకర్‌ ఏకపక్షంగా సస్పెండ్‌ చేశారు. కనీసం  టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం చాలా స్పష్టంగా ఉన్నా ప్రధాన ప్రతిపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఒక్క అక్షరం పొల్లు పోకుండా చదవాల్సి వున్నా స్పీకర్‌ దాన్ని చూడకుండా పక్కన పెట్టి వైసీపీ కార్యకర్తలా వ్యవహరించారు. 

ఒక పక్కన వాయిదా తీర్మానం స్పీకర్‌  తిరస్కరిస్తున్నారు. మరోపక్క చర్చకు సిద్ధమని ప్రజలను మభ్యపెడుతున్నారు. గతంలో శాసనసభలో చర్చలు ఎలా జరిగాయో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఈ దొంగ సర్టిపికెట్ల స్పీకర్. నాలుగున్నరేళ్ల నుంచి చట్టసభల్లో చంద్రబాబునాయుడిపైకి వైసీపీ సభ్యులను ఉసిగొల్పి తిట్టించడం తప్ప ఏనాడు ఈ స్పీకర్ సభలో   ప్రజాసమస్యలపై చర్చించించి ఎరుగడు. రాజ్యాంగబద్ధ పదవిలో వుండి అందరినీ సమానంగా చూడాల్సిన  స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తూ  అధికారపక్షానికి కొమ్ముకాస్తున్నారు. ఏదైనా అంశంపై ప్రతిపక్షం పట్టుబడితే తీవ్ర స్వరంతో నీచంగా మాట్లాడిన మాటలు వున్నాయి. ఇటువంటి వ్యక్తి స్పీకర్ స్థానానికి అర్హుడేనా ?నాలుగున్నరేళ్లలో ఎప్పుడూ ఏ అంశంపైనా ప్రతిపక్షానికి అవకాశమివ్వలేదు. సభలో ప్రతిపక్ష పార్టీ.. సమస్యలపై  మాట్లాడకుండా మైకులు కట్‌ చేస్తూ  ప్రజా సమస్యలపై చర్చకు వచ్చే అవకాశం ఇవ్వకుండా అధికారపక్షానికి అండగా నిలుస్తున్నారు. జగన్ రెడ్డి  అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అయినా గత  ప్రభుత్వం చేసిన పనులపైనా, చంద్రబాబునాయుడిపై దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకున్నారీ వైసీపీ సభ్యులు. 

ప్రతిపక్షం వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నిస్తే మైక్ కట్ చేస్తున్నారు. శాసనసభను వైసీపీ కార్యాలయంగా మార్చారు. తాను వైసీపీ కార్యకర్త అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులను యూజ్‌లెస్‌ ఫెలోస్‌ అనడం, అధికార పార్టీ సభ్యులను మన సభ్యులు అని మాట్లాడటం, ప్రతిపక్ష సభ్యులు తనవాళ్లు కాదంటూ మాట్లాడటం అంటే స్పీకర్‌ స్థానానికి  విలువను ఎంత దిగజార్చారో అర్ధమవుతోంది. 

వైసీపీ సభ్యులు  ప్రతిపక్ష సభ్యులను కుక్కలతో పోల్చి మాట్లాడుతున్నా స్పీకర్ వారిని మందలించలేదు. అధికార మదంతో కన్ను, మిన్ను కానకుండా మాట్లాడుతూ రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. సొంత మీడియాను  సభలోకి అనుమతించి ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేది మాత్రమే చూపిస్తూ, అధికారపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరు, వారు వాడుతున్న భాష  ప్రజలకు తెలియకుండా స్పీకర్‌ కట్టడి చేస్తున్నారు. కావునా పంది ఎంత బలిసినా నంది కాదన్న సామెత వుంది. అట్లాగే అల్పులకు ఎటువంటి పదవి దక్కినా ఆ పదవికి గౌరవం దక్కదు. ఆ స్పీకర్ స్థానానికే మాయని మచ్చ తెచ్చారు.

 నాలుగున్నరేళ్లుగా వైసిపి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు మొక్కుబడి తంతుగా నిర్వహిస్తున్నది. ఆరు నెలలకు ఒక సారి అసెంబ్లీ నిర్వహించాలి కాబట్టి బడ్జెట్ పద్దులు, వివిద బిల్లులు ఆమోదించు కొనేందుకు మాత్రమే అసెంబ్లీ నిర్వహిస్తున్నారు తప్ప ప్రజాసమస్యలు చర్చించి పరిష్కారం చూపేందుకు అసెంబ్లీ నిర్వహించడం లేదు. నాలుగున్నరేళ్ల లో 50 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. విలువలకు పట్టంకట్టి రాష్ట్రాల శాసనసభలకు మార్గదర్శకంగా నిలవాల్సిన అత్యున్నత అసెంబ్లీ పనితీరు జగన్ అండ్ కో ఆధ్వర్యంలో ఏ స్థాయికి దిగజారిందో అర్ధం చేసుకోవడానికి ఈ గణాంకాలే నిదర్శనం. కనీసం ఏడాదికి సగటున 30 రోజులైనా సమావేశం కాని శాసన వ్యవస్థపై అలుముకొన్న చీకట్లకు అద్దం పడుతుంది. రాష్ట్రాల చట్టసభలు ఏడాదికి కనీసం 45 నుండి 50 రోజులు సమావేశం కావాలని జాతీయ రాజ్యాంగ సమీక్షా సంఘం ఏనాడో సూచింది. కానీ అసెంబ్లీ సమావేశాలను సైతం ప్రహసనంగా మార్చిందీ వైసిపి ప్రభుత్వం. 

ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి పట్టుమని పది రోజులు కూడా నడవ లేదని పీఆర్ఎస్, ఓఆర్‌జి అధ్యయనం వెల్లడించింది. సభా సమయం తగ్గించడమే కాదు, చర్చలు లేకుండానే చట్టాలు రూపొందించడం ఆర్డినెన్సులతో పరిపాలించడం మరింత ప్రమాదకరం. శాసనసభను అగౌరవ పరిచే విధంగా అడ్డదారిలో ఆర్డినేన్సు తెచ్చి బడ్జెట్ ఆమోదించుకొన్నారు ఆ మధ్య. ఏడాదిపాటు రాష్ట్రానికి దిశా,నిర్ధేశం చేసే బడ్జెట్ సమావేశాలను ఒక తంతుగా ముగించారు. కోట్లాది ప్రజలకు సంబంధించిన కీలక బిల్లులుపై కూడా ఎటువంటి చర్చలేకుండా మందబలంతో ఆమోదించుకొని అసెంబ్లీని ఉత్సవ విగ్రహంగా మార్చిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసినట్లే ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన అసెంబ్లీని నిర్వీర్యం చేశారు. జరిగే కొద్దీ రోజులు అసెంబ్లీ సమావేశాల్లోనూ అబద్దాలు, సస్పెన్షన్లు తప్ప ప్రజలకు ఒరిగింది ఏముంది?

           అయిదు కోట్ల ప్రజల మనోభీష్టాలను ప్రతిబింబించే రాజ్యాంగ దేవాలయాన్ని తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకొనే వేధికగా మార్చారు. శాసనసభను కేవలం చట్టాలు చేసే సభగానే, బడ్జెట్ పద్దులను ఆమోదించుకొనే సభగానే పరిగణిస్తుంది తప్ప సగటు జీవి ఈతి భాధలపై అసెంబ్లీలో చర్చ జరగాలని ఇప్పటి వరకు నిర్వహించిన సమావేశాల ద్వారా రుజువైంది? ప్రజా సమస్యలు చర్చించి పరిష్కారం చూపడానికి, ప్రజల అవసరాలు తెలియ చెప్పడానికి ఒక అవకాశంగా ఉండాల్సిన శాసనసభను అమీ, తుమీ తేల్చుకొనే బరిలా మార్చారు. అసెంబ్లీ  నిర్వహణను సైతం ఏకపక్షంగా మార్చిన తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ప్రజా సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించడం, పరిష్కరించడం ప్రజా ప్రతినిధుల ప్రాథమిక కర్తవ్యం. ప్రజాసమస్యలు ప్రస్తావించడానికి ప్రయత్నించిన ప్రతిపక్ష సభ్యులను  చట్టసభల నుండి బయటకు నెట్టి, ప్రజా ప్రతినిధుల హక్కులను, చట్టబద్దంగా వారు చేయాల్సిన విధులను అడ్డుకొంటున్నారు.  

అనేక  అంశాలను ప్రస్తావనకు తేకుండా చట్టసభల్లో తనకున్న మంద బలంతో అడ్డుపడుతున్నారు. జగన్ ప్రభుత్వం ప్రతిపక్షమంటేనే లెక్కలేని విధంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షం లేవనెత్తే ఏ అంశాన్ని కూడా జగన్  ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రజా సమస్యలు కూడా చర్చకు రాకుండా జగన్  ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఈ తీరు ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఒక వ్యూహం ప్రకారం మంద బలంతో ప్రజాస్వామ్యంపై చేస్తున్న దాడిగా ప్రజలు పరిగణించాలి.

ప్రస్తుతం రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు సమస్యలతో హాహాకారాలు చేస్తున్నారు. అన్నిరంగాలు నేలమట్టం అయ్యాయి. వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలు,  రైతాంగం కష్టాలు ఆకాశాన్ని అంటిన నిత్యావసరాల ధరలు, పన్నులు భారం, యువతను చుట్టుముట్టిన నిరుద్యోగం, ఎయిడెడ్ విద్యా సంస్థలు మూసివేత,  ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, బీసి, ఎస్సీ, ఎస్టీ,  ముస్లిం మైనారిటి సబ్ కాంపోనెంట్ నిధుల మళ్లింపు, విద్యుత్తు చార్జీల పెంపు, తీవ్ర ఆర్ధిక సంక్షోభం వంటి అనేక అంశాలన్నింటిపై సమగ్ర చర్చ జరగాల్సి వుంది. కానీ ప్రభుత్వం సమస్యలు వదిలేసి చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసి సంబరాలు చేసుకొంటున్నది అసెంబ్లీలో. ఏనాడూ ప్రజా సమస్యలపై చర్చ అసెంబ్లీలో జరిగిన ధాఖలాలు లేవు. సభలో సమస్యలు  వదిలేసి స్కోత్కర్షాలు విపిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రికి భజన చేస్తున్నారు. అంతే తప్ప సమస్యలపై చర్చించేందుకు ముందుకు రావడంలేదు. ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రతిపక్షంపైకి సియం జగన్ ఉసి గొల్పితున్నారు. అన్నీ వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకొన్నట్లే అసెంబ్లీలో కూడా  తమ పరిపాలనను, తప్పులను ఎవరు ప్రశ్నించరాదనే ఉద్దేశ్యంతో వ్యవహరిస్తున్నారు. చట్ట సభలంటే జగన్మోహన్ రెడ్డికి ఏనాడూ గౌరవం లేదు, ప్రజాస్వామ్యం, రాజ్యాoగంపై అసలే నమ్మకం లేదు. అసెంబ్లీ కూడా జగన్ తన జాగీర్‌గా,స్పీకర్ తమ్మినేని కూడా అసెంబ్లీ తన జాగీరుగా భావిస్తున్నారు. సభలో సమస్యలపై చర్చించకుండా సమస్యలపై చర్చలకు ససేమిరా అనడం, పట్టుపట్టిన ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి సభా కార్యక్రమాలు జరుపుకోవడం జగన్ మార్క్ నిరంకుశత్వానికి నిదర్శనం. సభాసమయం తగ్గించడమే కాదు, సభలో ప్రజా సమస్యలు లేవనెత్తిన ప్రతిపక్షాన్ని బయటకు నెట్టడం, చర్చలు లేకుండానే చట్టాలు రూపొందించడం,  ఆర్డినెన్సులతో పరిపాలించడం జగన్ మార్క్ నిరంకుశ  రాజకీయానికి నిదర్శనమని చెప్పాలి.    
                                       
అట్లాగే ఈ మధ్య బ్లాక్ క్యాట్ కమాండోస్ ను తొలగిస్తే చంద్రబాబు ఫినిష్ అయిపోతారన్నారు స్పీకర్ తమ్మినేని. కానీ తెలుగుదేశాన్ని, చంద్రబాబుని ఫినిష్ చేస్తామని సవాళ్ళు రువ్విన వారు ఇప్పుడు ఎక్కడ వున్నారో ఆన్న విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. అధికార మదంతో కన్ను, మిన్ను కానకుండా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా మాట్లాడం చూసిన ప్రజలు ఛీ కొడుతున్నారు. రాజ్యాంగ పదవికి దహన సంస్కారం చేస్తున్నారు. రాజ్యాంగ బద్ద పదవికి రాజీనామా చేసి రాజకీయాలు మాట్లాడాలి.. గత ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్యను రాజకీయం చేసి లబ్ది పొందారు. ఇప్పుడు చంద్రబాబును అడ్డు తొలగించుకొని అధికారంలోకి రావాలని చూస్తున్నారు. చంద్రబాబుపై స్పీకర్ చేసిన పైత్యపు విమర్శలు ఆయన యజమాని జగన్మోహన్ రెడ్డి ఆనందపడటానికి పనికి వస్తాయి తప్ప ప్రజలకు పనికి రావు.  ప్రజాస్వామ్య ఉద్యమం ద్వారా ప్రజలను చైతన్యపరిచి అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రతి పక్షం తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం చేస్తుంది. మంచికి - చెడుకు, ధర్మానికి- అధర్మానికి, న్యాయానికి- అన్యాయానికి మధ్య జరిగిన ప్రతియుద్ధంలో ధర్మం, న్యాయానిదే పైచెయ్యి అయిన విషయం తెలుసుకొండి. అహంకారులకు, గర్వపోతులకు ప్రజల చేతిలో శృంగభంగం తప్పదు. ప్రజల చేతిలో ఓటమి శిక్షకు జగన్ ముఠా అంతా  సిద్ధంగా ఉండాలి. వ్యక్తిత్వం లేని కురచ బుద్దులు వున్న వారు రాజ్యాంగ బద్ద పదవిలో వుంటే ఈ విధంగానే మాట్లాడుతారు. నేను తెలుగుదేశం జెండా కప్పుకొనే చస్తానని ప్రగల్భాలు పలికిన తమ్మినేని... నారా చంద్రబాబు ఫినిష్ కావాలని మాట్లాడటం ఆయన అహంభావానికి నిదర్శం. కావునా అధికారం వుందని విర్రవీగ కండి, అన్నీ రోజులు మీవి కావు.రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రజలు తిరుగుబాటుతో ప్రపంచ చరిత్రలో ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిన విషయాన్ని గుర్తు తెచ్చుకొండి. అధికార మదంతో కన్ను, మిన్ను కానకుండా మాట్లాడుతూ రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇవ్వడం మంచిది కాదు. సీనియర్ నాయకుడిగా ఇటువంటి దిగజారుడు మాటలు మాట్లాడటం సిగ్గు చేటు. దీనినే వినాశకాలే, విపరీత బుద్ది అంటారు.


నీరుకొండ ప్రసాద్ 
సీనియర్ జర్నలిస్ట్