బయోపిక్‌పై క్లారిటీ వచ్చేసింది... ఎన్టీఆర్ కాదు, రాజమౌళి కాదు. మరెవరు?
on May 17, 2025
ఇటీవలి కాలంలో కొందరు దర్శకనిర్మాతలు, హీరోలు ప్రముఖుల జీవిత కథలను తెరకెక్కించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అందులో కొన్ని సినిమాలు విజయం సాధిస్తుండగా, మరికొన్ని ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈమధ్యకాలంలో అందరి దృష్టినీ ఆకర్షించిన బయోపిక్ దాదా సాహెబ్ ఫాల్కే. ఈ చిత్రాన్ని నితిన్ కక్కర్ దర్శకత్వంలో ఎస్.ఎస్.కార్తికేయ, వరుణ్ గుప్తా నిర్మిస్తున్నారని, ఎస్.ఎస్.రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తారని వార్తలు వచ్చాయి. మరోపక్క బాలీవుడ్‌లో ఇదే బయోపిక్‌పై ప్రచారం జోరందుకుంది. ఆమిర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి కాంబినేషన్‌లో దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. వినిపిస్తున్న ఈ రెండు వార్తల్లో ఏది నిజం అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా దీనిపై దాదా సాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ క్లారిటీ ఇచ్చారు.
‘మా తాతగారి బయోగ్రఫీ రాజమౌళి సమర్పణలో చేయబోతున్నారనే వార్త నేను కూడా విన్నాను. అయితే రాజమౌళి టీమ్ ఇంతవరకు నన్ను సంప్రదించలేదు. ఎవరైనా ప్రముఖుడి జీవిత చరిత్రను తెరకెక్కించాలంటే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. ఎందుకంటే వారికి తెలిసినన్ని విశేషాలు బయటి వారికి తెలియవు కదా. ఈ విషయంలో ఆమిర్‌ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి నన్ను చాలా సార్లు సంప్రదించారు. వారి టీమ్ నాతో మూడు సంవత్సరాలుగా ట్రావెల్ అవుతోంది. తాతగారి గురించిన చాలా విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ బయోపిక్‌ను ఎంతో సిన్సియర్‌గా అటెమ్ట్ చేస్తున్నారనిపిస్తుంది. ఆమిర్‌ఖాన్ చాలా మంచి నటుడు. ఆయన ఈ పాత్ర పోషించడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది’ అన్నారు.
దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్‌కి సంబంధించి బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఆమిర్‌ఖాన్, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన ‘సితారే జమీన్ పర్’ చిత్రం జూన్ 20న విడుదల కాబోతోంది. అక్టోబర్‌లో ఫాల్కే బయోపిక్ చిత్రీకరణ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. నాలుగేళ్లుగా ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. భారత స్వాతంత్య్ర పోరాటం, భారతదేశంలో సినిమా ఎలా పుట్టింది అనే అంశాలతో ఈ బయోపిక్ రూపొందిస్తారని సమాచారం. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్, రాజమౌళి ఈ బయోపిక్ చేయబోతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని అర్థమవుతోంది. కేవలం ఈ ప్రాజెక్ట్ గురించి ప్రచారం మాత్రమే జరిగిందని తెలుస్తోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
