ఇరాన్‌- ఇజ్రాయెల్‌ యుద్ధం.. సందిగ్ధంలో భారత్

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం తీవ్రతరమవుతున్నది. ఇరుదేశాలు దాడి, ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లోని ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొస్సాద్‌కు చెందిన డ్రోన్‌ ఫ్యాక్టరీని ఇరాన్‌ ధ్వంసం చేసింది. ఇరాన్‌ ఇంతకాలం హమాస్, హెజ్బొల్లా వంటి ప్రాంతీయ శక్తులను ఇజ్రాయెల్‌ పైకి ఎగదోసేది. ఇప్పుడు ఇజ్రాయెల్‌ నేరుగా ఇరాన్‌పై దాడికి దిగింది. రెండు దేశాలూ డ్రోన్లు, క్షిపణులతో దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. ఇది పశ్చిమాసియాతోపాటు మిగతా ప్రపంచంపైనా తీవ్ర ప్రభావం చూపనుంది.

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ వైరానికి 1979లోనే బీజం పడింది. ఆ ఏడాది ఇరాన్‌లో మతశక్తుల నాయకత్వంలో విప్లవం సంభవించింది. అయతుల్లా ఖొమైనీ సారథ్యంలోని ఇరాన్‌ మత పాలకులు ఇజ్రాయెల్‌ను జియోనిస్టు శత్రువుగా ప్రకటించారు. ఆ తర్వాత లెబనాన్‌లో హెజ్బొల్లా, గాజాలో హమాస్‌కు ఇరాన్‌ మద్దతునిచ్చి ఇజ్రాయెల్‌పై పోరుకు ఉసిగొల్పింది. ఇజ్రాయెల్‌కు అమెరికా, నాటో కూటమి పూర్తి మద్దతు ఇస్తూ వచ్చాయి. 2024 ఏప్రిల్‌లో సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబారి కార్యాలయంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో ఇరానియన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ అధికారులు హతమయ్యారు. ఇరాన్‌ అక్టోబరులో ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడి చేసింది. తాజాగా ఇజ్రాయెల్‌ ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరుతో ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. ప్రతిగా ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌లోని నగరాలపై దాడి చేసినా, ప్రాణనష్టం తక్కువే. ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలు, ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్‌ బాలిస్టిక్‌ మిసైళ్లు గణనీయమైన నష్టాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. మరోవైపు అణ్వాయుధ నిరోధ ఒప్పందం నుంచి ఉపసంహరించుకునే దిశగా ఇరాన్‌ యోచిస్తోంది.

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ పోరు ప్రభావం పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాలేదు. మిగతా ప్రపంచంపై కూడా ఆర్థిక, రాజకీయ ప్రభావాన్ని కనబరుస్తోంది.ఇరాన్‌ తీరంలోని హోర్ముజ్‌ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు వాణిజ్యంలో అత్యధిక భాగం నడుస్తోంది. ఈ జలసంధి బందయితే చమురు నౌకల రాకపోకలు స్తంభించిపోయి ప్రపంచ ఆర్థికం దెబ్బతింటుంది. ఇప్పటికే ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్‌కు తాజా పరిణామాలతో చమురు ఎగుమతులు నిలిచిపోతే ద్రవ్యోల్బణం కట్టు తప్పుతుంది. అది రాజకీయ అస్థిరతకు దారితీయకమానదు. 

తాజాగా అమెరికా, ఇరాన్‌ల మధ్య జరగాల్సిన అణు చర్చలు గాడి తప్పాయి. చర్చల నుంచి వైదొలగుతామనీ, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ)తో మాత్రమే సంబంధాలు కొనసాగిస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. దారికి రాకపోతే ఇరాన్‌పై మరింత తీవ్రంగా దాడులు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. వెంటనే అణు ఒప్పందం కుదుర్చుకోవడం మంచిదని హితవు పలికారు. ఇజ్రాయెల్‌ దాడులను విమర్శించిన రష్యా, చైనాలు ఇరాన్‌కు ఆయుధ, సాంకేతిక, దౌత్య సహాయాల్ని అందించి, ప్రత్యామ్నాయ సైనిక కూటములలో చేరాల్సిందిగా ప్రతిపాదించవచ్చు. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ పోరులో ప్రధాన దేశాలు జోక్యం చేసుకోవడం వల్ల పరిస్థితి మరింత ముదరవచ్చు.

పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు సరఫరాలపై భారత ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఈ దేశాల్లోని భారతీయ కార్మికులు, నిపుణులు జమచేసే విదేశ మారక ద్రవ్యం ఇండియాకు ఎంతో ప్రయోజనకరం. పశ్చిమాసియాతో భారత్‌కు సైనిక వ్యూహపరమైన ప్రయోజనాలూ ఉన్నాయి. అందువల్ల ఇరాన్‌, ఇజ్రాయెల్‌ పోరు దీర్ఘకాలం కొనసాగడం భారత్‌కు నష్టదాయకమే. చమురు సరఫరా స్తంభిస్తే ఇండియాలో ధరలు పెరిగిపోతాయి. రవాణా, పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింటాయి. ఎరువుల కొరతతో ఆహారోత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. ఇండియాకు ఇజ్రాయెల్‌తో రక్షణ, సాంకేతికపరంగా పొత్తు ఉంది. ఇరాన్‌లో చాబహార్‌ రేవును అభివృద్ధి చేయడం ద్వారా మధ్యాసియాతో రవాణా అనుసంధానం ఏర్పరచుకోవడానికి భారత్‌ కృషిచేస్తోంది. అందుకని ఇరాన్, ఇజ్రాయెల్‌లలో ఎటువైపూ మొగ్గలేని పరిస్థితి నెలకొంది. 

ప్రస్తుతం నడుస్తున్న యుద్ధం ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్యే సాగుతుందా, ఇతర శక్తులూ జోక్యం చేసుకుంటాయా అన్నది త్వరలో తేలిపోతుంది. ఇజ్రాయెల్‌ దాడుల వల్ల ఇరాన్‌ బాగా బలహీనపడింది. భారత్‌కు ఇరాన్, ఇజ్రాయెల్‌లు రెండింటితో సత్సంబంధాలు ఉన్నందువల్ల మధ్యవర్తిత్వం వహించగల స్థితిలో ఉంది. మరి చూడాలి ఈ యుద్ద వాతావరణం ఏ మలుపులు తిరుగుతుందో?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu