ఎయిరిండియా కష్టనష్టాల పరంపర ఇంకా ఆగలేదా?
posted on Jun 17, 2025 1:04PM

యువర్ అటెన్షన్ ప్లీజ్. హాంకాంగ్ టూ ఢిల్లీ ఫ్లైట్ నెంబర్ ఏ1- 315 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ చిన్న సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి హాంకాంగ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయబోతున్నామని ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రయాణికుల గుండెలు అరచేతిలోకి వచ్చేశాయి. ఎవరి ఇష్ట దైవాన్ని వారు తలుచుకోవడం మొదలు పెట్టారు.తిరిగి హాంకాంగ్ లో ఈ ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక బతుకు జీవుడా! అంటూ ఎటు వాళ్లు అటు పారిపోయారు. ఇంతా చేస్తే ఎయిరిండియా అధికార ప్రతినిథి చెప్పిందేంటంటే.. వారి ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తాం. లేదంటే టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తామని ప్రకటించడంతో దాదాపు అందరు ప్రయాణికుల నుంచి వచ్చిన మెసేజ్ రీఫండ్ చేయమని. యూపీలోని ఘజియాబాద్ నుంచి కోల్ కతా వెళ్లే ఫ్లయిట్ సిట్యువేషన్ ఇంకో రకం. గంట సేపు సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయిందీ ఫ్లైట్ నెంబర్ ఐఎక్స్- 1511, ఆ గంట సేపు ప్రయాణికులు ఊపిరి బిగబట్టి అలాగే కాలం గడిపారంటే వారి పరిస్థితేమిటో ఊహించుకోవచ్చు.
మరో భయంకరమైన ప్రయాణ అనుభవం విషయానికి వస్తే.. ఆరోజు సరిగ్గా జూన్ 12వ తేదీ. ఆ టైంలో అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి జైపూర్ రావల్సిన ఐఎక్స్- 196 దుబాయ్ లో రాత్రి 7. 44కి బయలు దేరాల్సింది మరునాటి వేకువ జాము 12. 44కి బయలు దేరింది. అంటే ఏకంగా ఐదు గంటలు. ఈ ఐదుగంటలూ ఆ ఫ్లైట్ లో నరకం చూశారు ప్రయాణికులు. ఏసీ లేదు. నీళ్లు, ఆహారం అందివ్వలేదు. పిల్లలుంటే వారు ఆ ఉక్కపోతలో ఆకలిదప్పులతో అలమటించినా పట్టించుకున్న పాపాన పోలేదు. పక్క రోజు వేకువ జాము 2. 44కి ఈ ఫ్లైట్ జైపూర్ లో ల్యాండయ్యింది. ఆ సమయంలో ఈ ఎయిరిండియా ప్రయాణికుల ఫీలింగ్ ఏంటో తెలుసా? హమ్మయ్యా మనం కూడా కాలి బూడిదవకుండానే నేలపై అడుగు పెట్టాం. గంటో అరగంటలో ప్రాణాలతో ఇంటికెళ్తాం. బాప్ రే బచ్ గయా.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
కాళరాత్రులంటారే సరిగ్గా అలాంటి ప్రయాణ అనుభవాన్నిస్తోంది ఎయిర్ ఇండియా. దాని టైం బ్యాడో.. లేక దాన్నెక్కే ప్రయాణికుల టైం సరిగా లేదో తెలీదు గానీ.. ఎయిర్ ఇండియా అంటేనే హడలి చస్తున్నారొక్కక్కరూ. ఇండిగో తర్వాత సెకండ్ బెస్ట్ ఎయిర్ లైనర్ ఎయిర్ ఇండియా. మొత్తం 102 దేశ విదేశీ తీరాలకు ప్రయాణికులను చేర్చే ఎయిర్ ఇండియా చరిత్ర ఈ నాటిది కాదు. ఇది 1932 నాటిది. దీని ఆపరేషనల్ హెడ్డాఫీస్ ఢిల్లీ. బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల్లోనూ నెట్ వర్క్ విస్తరించి ఉంది. ఇక హర్యానాలోని గుర్గాంలో మెయిన్ ఆఫీసుంది. ప్రస్తుతం ఎయిరిండియాలో డెబ్భై ఐదు శాతం వాటా టాటాలది కాగా మిగిలిన ఇరవై ఐదు శాతం సింగపూర్ ఎయిర్ లైన్స్ ది.
ఎయిరిండియా మధ్యలో చేతులు మారినా ఇటీవలే తిరిగి టాటాల పరమైంది. ఆనాటి నుంచి 14 శాతం మేర లాభాలను అర్జించింది. ఫైనాన్షియల్ ఇయర్- 24 కంటే, 25లో మెరుగైన టర్నోవర్ర సాధించింది. ప్రస్తుతం కూడా 11 శాతం పెరుగుదలతో 7 బిలియన్ డాలర్ల మేర టర్నోవర్ సాధిస్తోంది. అంతా బాగుందనుకునే లోపు ఇదిగో ఈ వరుస నష్టాలు. అహ్మాదాబాద్ లో ఏమని అనుమానాస్పద ఘోర విమాన ప్రమాదం జరిగిందో అప్పటి నుంచీ ఈ ఎయిర్ లైనర్ టైం పూర్తిగా తిరబడినట్టుంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందిస్తామంటోన్న ఎయిర్ ఇండియా.. వారి పాలిటి యమపాశమై.. దారుణంగా దెబ్బ తీస్తోంది.
ఇప్పుడెంతటి నష్టమంటే కేవలం అహ్మదాబాద్ డ్రీమ్ లైనర్ కుప్పకూలడంతో దాని విలువ 120 మిలియన్ డాలర్లు. అంటే దాదాపు వెయ్యి కోట్లు. అత్యవసర నిధి కింద పాతికలక్షల మేర ఈ ప్రయాణ బాధితులకు ఆర్ధిక సాయం ప్రకటించింది ఎయిరిండియా. ఆల్రెడీ కోటి రూపాయలు ఒక్కొక్కరికీ నష్టపరిహారం ఇస్తామని చెప్పింది. ఈ మొత్తం విలువ సుమారు 300 కోట్లు. ఇక ప్రమాదం జరిగిన రోజు బోయింగ్ తో సహా ఇండిగో తదితర విమాన యాన షేర్లన్నీ కుప్పకూలడంతో ఈ మొత్తం నష్టం విలువ సుమారు 6 లక్షల కోట్లు. దీంతో ఇటు తామే కాకుండా అటు బోయింగ్ సంస్థ ఆర్డర్లను కూడా ఎయిరిండియా ప్రభావితం చేస్తోన్న మాట వినిపిస్తోంది.
మరి ఈ నష్టాల నుంచి ఎయిరిండియాను గట్టెక్కించేవారేరీ. ఈ విషయాలు తెలిసిన ప్రయాణికులు ఎయిర్ ఇండియా అంటేనే హడలి పోతున్నారు. కారణం టేకాఫ్ అయిన 45 సెకన్లకే కుప్పకూలిపోయే విమానాలున్న ఈ సంస్థ మెయిన్ టైన్స్ సరిగా లేదన్న పేరు రావడంతో వారంతా ఈ ఫ్లయిట్ బుకింగ్స్ కి ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. ఫస్ట్ మీ దగ్గరున్న అన్ని రకాల విమానాలు, వాటి ఫిట్నెస్ ని ఒకసారి థార్డ్ పార్టీ చెకింగ్ చేసి మీ అధికారిక వెబ్ సైట్లలో వాటిని పోస్ట్ చేస్తే తప్ప.. ప్రయాణికుల్లో నమ్మకం రాదన్న మాట వినిపిస్తోంది విమానయాన రంగ నిపుణుల నుంచి.
తాజా వార్త ఏంటంటే మంగళవారం ఉదయం శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఫ్లయిట్ నెంబర్ ఏఐ- 180 విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం కనిపించడంతో ప్రయాణికులను కోల్ కతలో దింపేసింది. దీన్నిబట్టీ ఎయిర్ ఇండియాకేదో దురదృష్టం వెంటాడుతోంది. ఇది ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నట్టు తెలుస్తోంది.