ఆత్మహత్యాయత్నం నేరం కాదు.. సెక్షన్ 309 రద్దు
posted on Dec 10, 2014 2:41PM

ఇప్పటి వరకు దేశంలో ఆత్మహత్యాయత్నం నేరంగా పరిగణిస్తున్నాం. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తులు మరణించకుండా వుంటే, చట్టం వారిని చంపినంత పని చేస్తోంది. ఆత్మహత్యాయత్నం చేశారు కాబట్టి వారు నేరస్తులని ఇండియన్ పీనల్ కోడ్‌లోని 309 చట్టం అంటోంది. ఈ కేసును అనుసరించి మణిపాల్‌లోని ఇరోమ్ షర్మిళ అనే మహిళ పోలీసుల నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 309ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు దేశంలో ఆత్మహత్యాయత్నం నేరం కాదు. గతంలో ఆత్మహత్యాయత్నం చేసిన వారికి ఏడాది వరకు కారాగార శిక్ష విధించడానికి వీలుండేది. ఐపీసీలోని 309 సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని 1996లో సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ సెక్షన్‌ని తొలగించాలని లా కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ విషయంలో గతంలోనే పార్లమెంటులో బిల్లుని ప్రవేశపెట్టారు. ఇంతవరకు ఆ బిల్లు చట్టబద్ధం కాలేదు. ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 309ని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయానికి 18 రాష్ట్రాల నుంచి 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మద్దతు కూడా వుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.