కాల్పుల విరమణ.. భారత్ చేసిన చారిత్రక తప్పిదం!?
posted on May 12, 2025 10:33AM

పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రస్థావరాలు లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట నిర్వహించిన దాడులలో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు ప్రతిగా పాకిస్థాన్ భారత్ భూభాగం లక్ష్యంగా నిర్వహించిన డ్రోన్ దాడులతో రెండు దేశాల మధ్యా యుద్ధవాతావరణం నెలకొంది. దాడులు, ప్రతిదాడులతో యుద్ధం తప్పదన్న వాతావరణం ఏర్పడింది. అయితే అదే సమయంలో పాకిస్థాన్ డొల్లతనం కూడా ప్రస్ఫుటంగా ప్రపంచ దేశాలకు అర్ధమైంది. భారత్ తో తలపడే సత్తా కానీ, శక్తి కానీ పాకిస్థాన్ కు లేవన్నది తేటతెల్లమైంది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ సంధి అంటూ కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకు వచ్చింది. భారత్ అందుకు సై అంది. అది పక్కన పెడితే ఇరు దేశాల మధ్యా సంధి కుదర్చడం వెనుక తన పెద్దన్న పాత్ర కీలకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భుజాలను తానే చరిచేసుకున్నారు. భారత్, పాకిస్థాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న విషయం అందరి కంటే ముందే తాను వెల్లడించి క్రెడిట్ కొట్టేయాలని చూశారు. అయితే కాల్పుల విరమణలో అమెరికా పాత్ర కానీ, ఆ ధేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్రకానీ ఇసుమంతైనా లేదని భారత్ కుండబద్దలు కొట్టేసింది. పాకిస్థాన్ కోరిన మీదటే మానవతా దృక్పథంతో అంగీకరించినట్లు స్పష్టంగా చెప్పేసింది.
అయితే పాకిస్థాన్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ అంగీకరించడం పట్ల దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. అదీ బేషరతుగా కాల్పుల విరమణకు భారత్ అంగీకరించడాన్ని యుద్ధరంగ నిపుణులు చారిత్రక తప్పిదంగా అభివర్ణిస్తున్నారు. అసలు కాల్పుల విరమణ ఒప్పందం రైటా, రాంగా అన్న విషయంలో దేశంలో ఎక్కడా భిన్నాభిప్రాయానికి తావే లేకుండా ముక్తకంఠంతో భారత్ నిర్ణయం సరికాదని అంటున్నారు. యుద్ధం వల్ల భారీ నష్టం వాటిల్లుతుంది, మరణాలు సంభవిస్తాయి కనుక యుద్ధం ఎప్పడూ మంచిది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, భారత్ కు వ్యతిరేకంగా ప్రేరిపించి దేశంలో సృష్టిస్తున్న నిత్య మారణహోమానికి ఫుల్ స్టాప్ పడాలంటే.. ఆ దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించడం, పాక్ అధినంలో ఉన్న కాశ్మీర్ భాగాన్ని స్వాధీనం చేసుకోవడమే మార్గమని జనం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యధికుల నుంచి కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి చారిత్రక తప్పిదానికి పాల్పడిందని అంటున్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్ అత్యంత దుర్బలంగా ఉందనీ, ఆ దేశం ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదనీ, ఆర్థికంగా, రాజకీయంగా క్లిష్టపరిస్థుతులను ఎదుర్కొంటోందనీ, ఇటువంటి సమయంలో భారత్ మరింత ఒత్తిడి పెంచి.. ఆ దేశంలో తలదాచుకుంటున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులందరినీ సరండర్ చేయాలన్న షరతు విధించి ఉండాల్సిందనీ అంటున్నారు. భారత్ ఒత్తిడి పెంచి ఉంటేపాకిస్థాన్ భారత్ కు దాసోహం అని ఉండేదనీ, అలా కాకుండా కాల్పుల విరమణ ఒంప్పదం కుదుర్చుకోవడం ద్వారా పాకిస్థాన్ కు అనవసరంగా మళ్లీ శక్తియుక్తులను కూడదీసుకోవడానికి సమయం ఇచ్చినట్లైందని అంటున్నారు.