ఆల్మట్టి ఎత్తు పెరిగితే.. తెలంగాణ భూములు క్రికెట్ స్టేడియాలే!
posted on Sep 20, 2025 1:29PM

ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణ పొలాలు సాగు భూములుగా ఉండవనీ, క్రికెట్ స్టేడియంలుగా మారిపోతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలోని ఐదు జల్లాలకు వరప్రదాయిని వంటి కృష్ణానది రాష్ట్రంలో ఉనికిమాత్రంగా కూడా లేకుండా పోతుందని హెచ్చరించారు.
కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నదని రేవంత్ సర్కార్ దానిని ఆపాలని డిమాండ్ చేశారు. శనివారం (సెప్టెంబర్ 20)న మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత.. రాష్ట్రంలో మహాబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలకు అత్యంత ప్రధానమైన జలవనరు కృష్ణానదే అన్నారు. కర్నాటక ఆల్మట్టి ఎత్తు పెంచితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చుక్క నీరు అందదని పేర్కొన్నారు. కర్నాటక రాష్ట్రం ఆల్మట్టి డ్యాం ఎత్తును 524 అడుగులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నదన్న కవిత.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్మట్టి హైట్ పెంచకుండా జీవో ఉందని గుర్తు చేశారు.
ఇప్పుడు రేవంత్ కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి అయినా కోట్లాడి అయినా ఆల్మట్టి ఎత్తు పెంచకుండా చూడాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సోనియాతో ఫోన్ చేయించి ఆల్మట్టి ఎత్తు పెంపును విరమించుకునేలా చేయాలని ఆమె రేవంత్ ను కోరారు. త్వరలో జరగనున్న కృష్ణా ట్రిబ్యునల్ మీటింగ్ కు సీఎం స్వయంగా వెళ్లి ఆల్మట్టి ఎత్తు ఆపే విధంగా పోరాటం చేయాలని డిమాండ్ చేశారు.