భారత్ లో జెన్ జీ కి స్కోపెంత?
posted on Sep 20, 2025 10:57AM

భారత్ లో జెన్ జీ మూమెంట్ వస్తుంది. అందుకు మా పూర్తి సహకారం ఉంటుందంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నేపాల్లో జరిగిన ఈ జెన్ జీ ఉద్యమంలో విద్యార్ధులదే కీలక పాత్ర. మొన్నా మధ్య బంగ్లాదేశ్ లో జరిగిన ఉద్యమాలకు కూడా ఆయువు పట్టు అక్కడి విద్యార్ధులే. నేపాలీ విద్యార్ధులు పాలకుల అవినీతి మీద ఫైర్ అయితే, బంగ్లాలో రిజర్వేషన్ల వ్యవహారంలో భగ్గుమన్నారు. దీంతో ప్రభుత్వాలు కూలిపోయాయి. అలాంటి సిట్యువేషన్ ప్రెజంట్ భారత్ లో ఉందా? ఇక్కడి యూత్ అంతటి ఆగ్రహావేశాలతో రగలిపోతున్నారా? అన్నది పరిశీలించాల్సి ఉంది.
ప్రస్తుతం భారత్ లోని విప్లవాగ్ని జ్వాలలు బాగా తగ్గిపోయాయి. వర్సిటీ టూ ఫారెస్ట్ వెళ్లే యూతే లేదిప్పుడు. అంతా క్యాంపస్ సెలక్షన్స్. థర్డ్ ఇయర్ లోనే ఆయా విద్యార్ధులను ఎగరేసుకుపోతున్నాయి కార్పొరేట్ కంపెనీలు. కొండొకచో ఒక్కో టాలెంటెడ్ విద్యార్ధికి కోట్లాది రూపాయల ఆఫర్లు అందుతున్నాయ్. దీంతో యూత్ మూడ్ కౌన్ బనేగా కరోడ్ పతీ.. అన్నట్టుగా ఉంది. ప్రెజంట్ ఏపీ తెలంగాణ యూత్ విషయానికి వస్తే.. ఏదో సోసోగా బీటెక్ చేశామా.. అమీర్ పేటలో ఒక డిప్లమో కోర్సు చదివామా.. ఫేక్ ఎక్స్ పీరియన్స్ పెట్టామా.. యూఎస్ చెక్కేశామా అన్న కోణంలో థింక్ చేస్తున్నారు తప్ప దేశస్థితిగతులు, సమస్యలూ.. ఇవన్నీ పట్టించుకునే వాతావరణం లేదనిపిస్తోంది.
ఇప్పుడు అమెరికాకు చెక్కేసే సిట్యువేషన్ కూడా లేక పోవడంతో.. వీరంతా ప్రస్తుతం ఇక్కడే స్థిరపడేలా కొత్తదారులు వెతుకుతున్నారు. బీటెక్ చదివి కూడా ఏమేం చేసి సంపాదించుకోవచ్చో పరిశీలిస్తున్నారు. అంతెందుకు ఈ మధ్య బీటెక్ పానీపూరీ వాలా అంటూ ఒక అమ్మాయి ఏకంగా తన డిగ్రీ పేరిట బోర్డు పెట్టేసింది. అంతగా యువత ఇక్కడే ఉండి ఎలా ఎదగొచ్చో పరిశీలిస్తున్నారు.
మారిన కాలమాన పరిస్థితుల కారణంగా.. నగర జీవనం ఎలా సాగించాలో అడవుల్లోకి వెళ్లి వెతుక్కోవడం లేదు. ఇక్కడే ఇంటి పట్టునే ఉండి.. యావరేజ్ గా నెలకో యాభై వేలు ఎలా సంపాదించాలో చూస్తున్నారు. తద్వారా.. వారికంటూ విప్లవానికి సంబంధించిన ఆశలు ఆశయాలేం పుట్టడం లేదు. అమిత్ షా అన్నట్టు పకోడీలు అమ్ముకునైనా బతకొచ్చన్న కోణంలో థింక్ చేస్తున్నారు. మీరు కావాలంటే ఏదైనా ట్రిప్ వెళ్లినపుడు ఆ యా టూరింగ్ స్పాట్స్ లో చిన్నా చితకా బిజినెస్ చేసే వాళ్లను చూడండి.. వారి వారి క్వాలిఫికేషన్లు అడగండి.. బీటెక్, ఎంటెక్ అంటారు.
ఇక స్టార్టప్ ల సంగతి సరే సరి. ఈ స్టార్టప్ లకు వాటి తాలూకూ ఇంక్యుబేటర్లకు స్కిల్ డెవలప్మెంట్ పేరిట ఇస్తున్న ప్రోత్సాహకాల కారణంగా కొందరు కొత్త కొత్త ఐడియాలు వేసి.. కోట్లు సంపాదించడం ఎలా? అన్న కోణంలో థింక్ చేస్తున్నారు. ఆ మాటకొస్తే.. తాను ఒకరి కింద పని చేయడం ఏంటి? పది మందికీ తానే జాబ్స్ ఇస్తే ఎలా ఉంటుందో బిల్ గేట్స్ కా బాప్ రేంజ్ లో థింక్ చేస్తున్నారు. ఇపుడీ జనరేషన్ ఎంజాయ్ మెంట్ ని ఎక్కువగా కోరుకుంటోంది. ఇక్కడ వారికి కావల్సింది పని, డబ్బు, ఆపై ఫుల్ ఎంటర్టైన్మెంట్. అది దొరికితే చాలు ఇక విప్లవాలు వాటి కారణంగా ప్రాణాలు కోల్పోవడం ఎందుకు? అన్న కోణంలో థింక్ చేస్తున్నారు. ఉద్యమాలు నడిపేంత తీరుబాటు వెసలుబాటు ఎవరికీ లేదిక్కడ.
మరి భారత్ లో జెన్ జీ మూమెంట్ ఎలా వస్తుంది? రాహుల్ ఆశలు ఆశయాలు నెరవేరే దారేదని చూస్తే.. అప్పుడప్పుడూ అక్కడక్కడా అందుకు తగిన అవకాశాలు వస్తుంటాయి. కానీ అవి చాలా చాలా పరిమితంగా మాత్రమే ఉంటున్నాయి. ఎవరూ రిస్క్ తీస్కుని అక్కడేదో తగలబడుతోందని ఆ మంటల్లో పడి మాడి మసై పోవడం లేదు. అంత జాగ్రత్తగా ఉంటోంది ప్రెజంట్ యూత్. బేసిగ్గా ఉద్యమాల ద్వారానే నాయకులు పుట్టుకొస్తారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నాయకులంతా గతంలో ఒక ఎమర్జెన్సీ టైంలో వచ్చిన వారే. ఆ తర్వాతి కాలంలో.. తెలంగాణ ఉద్యమం లాంటి వాటి ద్వారా వచ్చారు. ఇప్పుడు రాహుల్ రాజేస్తున్న ఈ ఉద్యమంలోకి యువత అంతగా దూసుకురావాలంటే అందుకంటూ తగిన వాతావరణ స్థితిగతులు ఏర్పడాలి. అలాంటి పరిస్థితులు కూడా తయారు కావాలి.
దానికి తోడు ఇటు పాక్ అటు బంగ్లా ఆపై నేపాల్లో కావాలనే అలజడులు సృష్టించి.. అటు పిమ్మట ఆ జ్వాలలు.. భారత్ లోకి తీసుకురావాలన్నది రాహుల్ కొందరు విదేశీయులతో కలసి చేస్తోన్న కుట్రగా అంచనా వేస్తున్నారు. అందుకే ఈ జెన్ జీ కామెంట్లు గుప్పిస్తున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న యువత.. మానసిక- సామాజిక- ఆర్ధిక- రాజకీయ స్థితిగతుల్లో రాహుల్ గాంధీ ఆశిస్తున్నట్టు ఈ జెనరేషన్ కదులుతుందా? అన్నది అనుమానమే అంటారు చాలా మంది.