భారత మహిళా క్రికెట్‌కు "బూస్ట్" దొరికినట్లేనా..?

ఎక్కడో ఇంగ్లాండ్‌లో పుట్టిన క్రికెట్‌కు ఇండియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎన్నో మతాలతో అప్పుడప్పుడు కొట్టుకుచచ్చే ఈ దేశంలో అందరినీ ఏకం చేసేది ఏదైనా ఉంది అంటే అది ఒక్క క్రికెట్ మాత్రమే. మ్యాచ్ ఉందంటే చాలు చిన్న పెద్దా ఇళ్లలో, రోడ్ల మీద, ఆఫీసుల్లో గుమిగూడి కమాన్ ఇండియా..! అంటూ ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు. ఇక క్రికెటర్లకు భారత్‌లో ఉండే ఫాలోయింగ్ మరే ఇతర సెలబ్రిటీస్‌కి ఉండదు, వాళ్లను దేవుళ్లతో సమానంగా పూజిస్తారు అభిమానులు. సచిన్, సౌరవ్, ద్రవిడ్, ధోని, కోహ్లీ ఇలా ఎంతోమందిని గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు ఈ దేశంలో..మనకు పురుషుల క్రికెట్ జట్టు ఉందని అందరికీ తెలుసు.

 

కానీ మహిళా జట్టు కూడా ఒకటి ఉందని..ఎంత మందికి తెలుసు. కనీసం ఒక్క మహిళా క్రికెటర్ పేరైనా తెలుసా..? అన్ని రంగాల్లో మహిళలపై వివక్ష ఉన్నట్లే..క్రికెట్‌లోనూ ఉంది. మహిళా క్రికెటర్లంటే వాళ్లను పిచ్చివాళ్లలా చూసేవారు. దీనికి కారణం పరిమిత శిక్షణా అవకాశాలు, పరిమిత మ్యాచ్‌లు, రోజువారీ ఖర్చులకు డబ్బులు ఇవ్వని స్థితి..ఇన్ని అవమానాలు, అడ్డంకుల మధ్య తాము పురుషులకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తోంది టీమిండియా మహిళల జట్టు. మిథాలీ రాజ్, వేద కృష్ణమూర్తి, హర్మన్ ప్రీత్ తదితర క్రికెటర్ల రాకతో భారత మహిళా జట్టుకు కొత్త రూపు వచ్చింది. క్రమంగా వీరి ప్రాతినిధ్యంలో జట్టు విజయాల శాతం పెరిగింది. ఇటీవల ముగిసిన మహిళల ప్రపంచకప్‌లో తృటిలో ట్రోఫిని కోల్పోయినా యావత్ భారతావని హృదయాలను వారు గెలుచుకున్నారు. ఇది మన మహిళా క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బీజం వేసినట్లైంది.

 

ఇంతకాలం ఆటుపోట్లకు, అవమానాలకు గురైన మహిళల జట్టుపై బీసీసీఐ, ప్రభుత్వం, ప్రజలు దృష్టి సారించడానికి ఈ ప్రపంచకప్ బాటను వేసిందని చెప్పవచ్చు. దీని వల్ల మహిళా క్రికెటర్ల నైపుణ్యాలు పెరగడంతో పాటు, ఆర్థికంగా పుంజుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అంతా సవ్యంగా జరిగితే అతి త్వరలోనే మహిళా ఐపీఎల్ కూడా ప్రారంభమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.