5దేశాల ప్రధానుల సీక్రెట్ మీటింగ్!

ఒక్కోసారి చిన్న పొరపాటు పెద్ద ఆశ్చర్యానికి దారి తీస్తుంది! పెద్ద పెద్ద కలకలానికి కూడా దారి తీయవచ్చు! కాని, పరిస్థితి అంతదాకా వెళ్లలేదు ఇజ్రాయిల్ లో! ఈ మధ్యే మన ప్రధాని మోదీ ఇజ్రాయిల్ వెళ్లివచ్చారు. ఆ తరువాత మన మీడియా మరోసారి ఇజ్రాయిల్ గురించి పెద్దగా మాట్లాడటం మానేసింది. ఇన్ ఫ్యాక్ట్ అవసరం కూడా లేదు! అయితే, తాజాగా ఇజ్రాయిల్ లో జరిగిన ఓ పొరపాటు సంచలనం రేపుతోంది! అందులో మన నమో పేరు కూడా ఇన్వాల్వ్ అవ్వటం మరింత ఆసక్తికరంగా మారుతోంది!

 

ఇంతకీ… ఇజ్రాయిల్ లో ఏం జరిగిందంటే… ఓ మైక్రో ఫోన్ అనుకోకుండా ఆన్ చేసి వుండిపోయింది! దీని వల్ల ఏం జరిగుంటుంది అనుకుంటున్నారా? ఆ మైక్రో ఫోన్ వున్నది ఓ సీక్రెట్ మీటింగ్ జరుగుతోన్న రూంలో! అందులో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్న్యాహుతో పాటూ యూరప్ నుంచి వచ్చిన నాలుగు దేశాల ప్రధానులు వున్నారు! యూరోపియన్ యూనియన్ లో భాగమైన హంగేరి, చెక్ రిపబ్లిక్, పోలాండ్, స్లోవేకియా దేశాల అధిపతులు మీటింగ్ లో వుండగా ఇజ్రాయిల్ ప్రైమినిస్టర్ వాళ్లని కడిపారేశాడు. అదంతా మరో రూంలో వున్న జర్నలిస్టుల చెవుల్లో పడింది. అలా బయటకు పొక్కింది. సాధారణంగా ఇలాంటి హైలెవల్ మీటింగ్ ల వివరాలు యధాతథంగా బయటకు రావు…

 

ఈయూ భాగస్వామ్య దేశాలతో ఇజ్రాయిల్ ప్రధాని ముఖ్యంగా మాట్లాడింది ఏంటంటే… పాలస్తీనాకు మద్దతుగా తమతో యూరోపియన్ దేశాలు తగినంత స్నేహం చేయటం లేదని. దీని వల్ల తమకు జరిగే నష్టం కన్నా యూరోపియన్ దేశాలకు కలిగే నష్టమే ఎక్కువ ముఖం మీద చెప్పాడు. అంతే కాదు, ఈయూ ఇజ్రాయిల్ లాంటి సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాన్ని పట్టించుకోకుండా చరిత్రలో కలిసిపోవాలని భావిస్తే తాను ఏమీ చెప్పేది లేదని కటువుగా మాట్లాడాడు నెత్యాన్న్యాహు! అయితే, ఇదే క్రమంలో చైనా, ఇండియా గురించి కూడా ఆయన ప్రస్తావించాడు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమతో అనేక రంగాల్లో సహకరించటానికి సిద్దంగా వున్నాడని యూరప్ నేతలకి తెలిపాడు. ఇక మన మోదీ తన పర్యటనలో భాగంగా పరిశుభ్రమైన నీళ్లు కావాలని, అవి ఎలా దొరుకుతాయని అడిగారట!

 

ఇజ్రాయిల్ నుంచి సాంకేతిక అంశాల్లో భారత్ లాభపడాలన్నది మోదీ సర్కార్ ఆలోచన. అందులో భాగంగానే పీఎం మంచి నీటి సమస్యని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై చర్చించారు నెత్యాన్న్యాహుతో! మొత్తానికి ఒక చిన్న మైక్రోఫోన్ ఆఫ్ చేయకపోవటం వల్ల ఇంత సమాచారం బయటకొచ్చేసింది. మరీ ముఖ్యంగా, యూరప్ నేతలకి ఇజ్రాయిల్ ప్రధాని చైనా, ఇండియాల్ని చూపిస్తూ హెచ్చరిక చేయటం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం!