రంజీ ట్రోఫీకి హైదరాబాద్ క్రికెట్ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ
posted on Oct 9, 2025 8:46AM

ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్థాన్ పై విజయంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మను హైదరాబాద్ రంజీ క్రికెట్ జట్టు కెప్టెన్ గా నియమిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. టీమ్ ఇండియా స్టార్ బౌలర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఈ రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్నారు. సిరాజ్ కు దేశవాళీ క్రికెట్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. ఆస్ట్రేలియా పర్యటన, సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ల నేపథ్యంలో సిరాజ్ కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది.
దీంతో సిరాజ్ రంజీట్రోఫీకి అందుబాటులో ఉండడు. దీంతో తిలక్ వర్మకు హైదరాబాద్ జట్టు పగ్గాలు అప్పగిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం రంజీ ట్రోఫీకి 15 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. హైదరాబాద్ జట్టులో సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్, అభిరత్ రెడ్డి, హిమతేజ, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, నిశాంత్, అనికేత్ రెడ్డి, కార్తికేయ, అలీ కాచి డైమండ్, రాహుల్ రాదేశ్ తమ స్థానాలను తిరిగి నిలబెట్టుకున్నారు.
గత సీజన్‌లో ఎలైట్ గ్రూప్-బిలో ఆడిన హైదరాబాద్ జట్టు ఆడిన ఏడు మ్యాచ్ లలో కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సారి తిలక్ వర్మ కెప్టెన్సీలో జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుందన్న ఆశాభావం హైదరాబాద్ క్రికెట్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.