హైదరాబాద్‌లో భారీ వర్షం..ఐఎండీ అలర్ట్ ప్రకటన

 

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, నాంపల్లి, చార్మినార్, కోఠి అబిడ్స్, రామంతపూర్, అంబర్‌పేట్ సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వాన పడుతోంది. దీంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కురుస్తున్న తరుణంలో బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిస్తన్నారు.  మండు వేసవిలో ఉక్కపోతలో ఇబ్బంది పడిన నగరవాసులకు ఉపశమనం లభించింది. బుధవారం ఉదయం నుంచి జంట నగరాలపై మేఘాలు కమ్ముకోగా.. మధ్యాహ్నాం నుంచి పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం కురుస్తోంది.

 కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తం అయ్యింది. సాయంత్రం పనులు ముగించుకుని వెళ్లేవాళ్లను అప్రమత్తం చేస్తోంది. మ్యాన్‌ హోల్స్‌, కరెంట్‌ పోల్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచించింది.ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాజధాని నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు  జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్‌ అలర్ట్‌లు జారీ చేసింది. ఇక పంట చేతికొచ్చే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికార యంత్రాంగం సూచిస్తోంది. వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. 

రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండడంతో.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.  మరోవైపు వరంగల్‌, సూర్యాపేట జిల్లాల్లో వర్షం కురుస్తోంది. నర్సంపేట, ఖానాపురం మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. బుధవారం తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌తో పాటు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంది

Online Jyotish
Tone Academy
KidsOne Telugu