హైదరాబాద్‌లో భారీ వర్షం...వాహనదారుల ఇబ్బందులు

 

హైదరాబాద్‌లో పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, పెద్దఅంబర్‌పేట ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట,  హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెంట్, ఎర్రగడ్డ, బోరబండ  తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్ల జలమయం అయ్యాయి. వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 

ఖైరతాబాద్‌-రాజ్‌భవన్‌ రోడ్డులో మోకాలి లోతు వరద నీరు నిలిచి పోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.


ఉత్తర–ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని సూచించింది. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

అదే విధంగా, ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 26న అది వాయుగుండంగా బలపడవచ్చని తెలిపింది. 27న ఆ వాయుగుండం దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరానికి చేరే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu