జుడాలకు మద్దతు తెలిపిన చంద్రబాబు

హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మెకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు. గాంధీ హాస్పటల్లో దీక్ష చేస్తున్న జుడాలను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ప్రభుత్వం జుడాల న్యాయమైన కోర్కెను తీర్చడంలో విఫలమైందని బాబు విమర్శిస్తున్నారు. ఆరోగ్య మంత్రి, ముఖ్యమంత్రి సమస్యను పరిష్కరించకుండా ఒకరిమీద ఇంకొకరు ఆరోపణలు చేసుకుంటున్నారని బాబు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దాటవేత ధోరణిని అవలంబించకుండా చిత్తశుద్ధితో జూడాల కోర్కెలను పరిష్కరించాలని బాబు డిమాండ్ చేశారు. ఎన్ని రకాలుగా ఉద్యమించినా డిమాండ్లు పరిష్కరించకపోవడం ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తోందని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం దిగి వచ్చే వరకు జూనియర్ డాక్టర్లకు అండగా ఉంటామని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు చెప్పారు. వెంటనే చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతమవుతుందని ఆయన హెచ్చరించారు. స్టయిఫండ్ పెంపు కోసం జూనియర్ డాక్టర్లు కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష సోమవారం ఆరో రోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న వారిలో రవి అనే వైద్యుడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతన్ని ఐసియుకు మార్చారు. జూడాలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్సి బివి రాఘవులు కూడా మద్దతు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu