ఎమ్మార్ కేసులో సీబీఐ కొత్త పంథా?
posted on Jan 30, 2012 1:30PM
హైద
రాబాద్ : ఎమ్మార్ కేసులో సీబీఐ కొత్త పంథాలో సాగుతోన్నట్టు తెలుస్తోంది. నిజనిజాలను రాబట్టేందుకు సీబీఐ థర్డ్ డిగ్రీ దారిలో సాగుతోన్నట్టు సమాచారం. థర్డ్ డిగ్రీ విజువల్స్ మిగతా విల్లాల ఓనర్లకు చూపించి బెదిరించారని ఎమ్మార్ ప్రాపర్టీస్ మాజీ సీఈవో విజయరాఘవన్ తరుపు న్యాయవాది సీబీఐ కోర్టుకు తెలిపారు. విజయరాఘవన్ శరీరంపై గాయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్ 19న విజయరాఘవన్‌పై థర్డ్ డిగ్రీ ప్రయెగించారని, ఇక విజయరాఘవన్‌ను సీబీఐ కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని సదరు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో విజయరాఘవన్ థర్డ్ డిగ్రీ ఆరోపణలు ఎమ్మార్ వ్యవహారంలో కీలక మలుపుతిరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీబీఐ విజయరాఘవన్ విషయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఉంటే, సీబీఐ కొత్త పంథాలో సాగుతుందనే చెప్పవచ్చని, నిందితులు నిజాలు చెప్పని పరిస్థితుల్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం కూడా ఉండొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. జగన్ ఆస్తుల వ్యవహారంలో విజయసాయిరెడ్డి నిజాలు చెప్పడం లేదని, ఆయనకు నార్కో పరీక్షలు నిర్వహించాలని సీబీఐ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అక్రమ మైనింగ్ వ్యవహారం తదితర కేసులను విచారిస్తున్న సీబీఐ ప్రత్యేకించి విజయరాఘవన్‌పైనే ఎందుకు థర్డ్ డిగ్రీకి ప్రయత్నిస్తుందన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఈ విషయంలో నిజనిజాలు తెలిస్తే సీబీఐ వ్యవహార శైలి సంచలనం కానుంది.