మనిషనే వాడున్నాడా!

 

పాపం ఆ పాప పార్కులో ఒంటరిగా దీనంగా కూర్చుని ఉంది. తన చుట్టూ ఎంతోమంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఎందరో పెద్దలు కబుర్లు చెప్పుకొంటున్నారు. కానీ ఎవరూ ఆమెని అంతగా పట్టించుకోవడం లేదు. తమతో ఆడుకోమని పిల్లలు అడగడం లేదు. ‘దీనంగా ఉన్నావేంటి తల్లీ!’ అని పెద్దలూ విచారించడం లేదు. కారణం! ఆ పాపని చూడగానే తనో పేదరాలు అని తెలిసిపోతోంది. దానికి తోడు ఆమెని నిరంతరం వెక్కిరించే నీడలా, వీపు మీద పొడుచుకువచ్చిన గూని ఒకటి.

 

పిల్ల అలాగే దీనంగా కూర్చుని ఉంది. గంట.... రెండు గంటలు... మూడు గంటలు... మధ్యాహ్నం... ఎవరూ ఆ పిల్లని పెద్దగా గమనించినట్లుగా లేదు. ఒకవేళ చూసినా చూడనట్లు సాగిపోతున్నారేమో! అసలే పేదతనంతో చిరిగిన బట్టలు, ఆపై గూని... ఆ పాపని పలకిరించే ధైర్యం ఎవ్వరూ చేయడం లేదేమో! కనీసం ‘అన్నం తిన్నావా?’ అని కూడా ఆ చిట్టి తల్లిని అడగాలని ఎవరికీ తోచలేదు.

 

సాయంత్రం అయ్యింది. పాప అలాగే కూర్చుని ఉంది. ఇంతలో ఒక యువకుడు నిదానంగా ఆ పాప వైపుగా అడుగులు వేసుకుంటూ వచ్చాడు. ‘చాలాసేపటి నుంచి చూస్తున్నాను. నువ్వు ఇక్కడే కూర్చున్నావేంటి? నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్లున్నావు. ఏంటి విషయం?’ అంటూ అడిగాడు.

 

తనని ఎవరో అజ్ఞాతవ్యక్తి పలకరించేసరికి ఆ పాప ఒక్కసారిగా కంగారుపడిపోయింది. ‘ఏం లేదు.. ఏం లేదు,’ అంటూ తడబడింది. కానీ ఆ మనిషి ఊరుకునేలా లేడు. నిదానంగా పాపని మాటల్లోకి దింపి ఆమె కుటుంబం గురించీ, ఆర్థిక సమస్యల గురించీ, చదువు గురించీ తెలుసుకున్నాడు. మాటల్లో పడి రాత్రివేళ కావడాన్ని వాళ్లిద్దరూ గమనించనేలేదు. తన చుట్టూ కమ్ముకుంటున్న చీకట్లని చూసి ఆ యువకుడు ఒక్కసారిగా కంగారుపడ్డాడు. ‘చూడూ! ఇంత రాత్రివేళ నువ్వు ఇలాంటి చోట ఉండటం అంత మంచిది కాదు. మీ ఇంటికి వెళ్లిపో!’ అంటూ ఆమెని సాగనంపాడు. పార్కు గేటుదాకా ఆమెకి తోడు వచ్చి చేతిలో ఓ వందరూపాయల కాగితాన్ని పెట్టాడు. అతని ప్రవర్తన చూసి పాప కళ్లలో నీళ్లు తిరిగాయి.

 

‘నా అవతారాన్ని చూసి, అవకరాన్ని చూసీ జోలికి వచ్చేందుకు కూడా భయపడిపోతారు. మరి మీకెందుకు నన్ను పలకరించాలని అనిపించింది,’ అంటూ కన్నీటితో అడిగింది. దానికి ఆ యువకుడు చిరునవ్వుతో ‘నా దృష్టిలో నువ్వు ఒక దేవతవి. మనుషుల మనసులో ఇంకా జాలి ఉందో లేదో గమనించడానికి వచ్చిన దేవదూతవి. మనిషి అన్న మాటలో మానవత్వం మిగిలుందో లేదో పరీక్షించేందుకు వచ్చిన చిట్టి తల్లివి. నీలాంటి వారిని పట్టించుకోకపోతే సమాజం అన్న మాటకు విలువ లేదు,’ అంటూ వెళ్లిపోయాడు. తనని వీడి వెళ్లిపోతున్న ఆ యువకుడిని చూసిన ఆ పాప మొహంలో ఓ చిరునవ్వు విరిసింది. నిజంగానే ఆమె దేవదూతేనేమో!

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.