“ఒకరి హక్కుల్ని కాల రాయటమంటే, వారి అస్తిత్వాన్ని కాల్చివేయటమే” -మానవ హక్కుల దినోత్సవం 2024 !

 


మనమంతా ఒప్పుకోవాల్సిన, గుర్తించాల్సిన విషయం ఏమంటే, ఈ భూమి మీద ఉండే ప్రతీ జీవికి కొన్ని హక్కులు ఉంటాయి.  జీవించే హక్కు, స్వేచ్చ సమానంగానే ఉంటాయి. ఈ విశాల ప్రపంచంలో ప్రతీ జీవికి దానికంటూ ఓ గుర్తింపు, ప్రత్యేకత కూడా ఉంటాయి. ఈ భూమి మీదున్న జీవజాలమంతా ఒకటి ఇంకోదానిపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి ఉంటుంది. ఈ ప్రకృతిలో దేని విలువ దానికి ఉంటుంది. మనుషుల విషయంలో కూడా అంతే.  

నేటి ప్రపంచం లింగం, జాతి, వర్గం, మతం వంటి విభాగాలుగా, వివక్షలతో విభజించబడింది. ఇది చాలా సాధారణం అనిపించవచ్చు కానీ అలా విభజించబడిన వారికి మాత్రం నరకప్రాయంగా ఉంటుంది. ఈ క్రూరత్వానికి  బలవుతున్న వారిలో అమాయక పిల్లలు కూడా ప్రధానంగా ఉన్నారు. ప్రతి పిల్లవాడు, ప్రతి వ్యక్తి  కులం, మతం,  రంగు,  ఆర్థిక స్థితి  వంటి విషయాలు పరిగణలోకి తీసుకోబడకుండా అందరిలో సమానంగా   ఉండే ప్రపంచం కనిపించడం లేదు. ఈ వివక్ష ప్రజలను వేరు చేస్తోంది.  ఈ బేధాలతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి వారికున్న మౌలిక హక్కుల్ని,  స్వేచ్ఛను ప్రపంచానికి గుర్తు చేయడానికి డిసెంబర్ 10వ తేదీన ప్రతీ సంవత్సరం మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటారు.


1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్(UDHR) ని  ఆమోదించిన జ్ఞాపకార్థంగా జరుపుకునే ఈ రోజున  సమాజంలోని వ్యక్తులు, సంస్థలు,  ప్రభుత్వాలన్నీ   కలిసి ఈ హక్కులను కాపాడేందుకు, హక్కుల పరిరక్షణని ప్రోత్సహించేందుకు కృషి చేయాలని పిలుపునిస్తుంది.

యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (UDHR):

మానవ హక్కులపై కీలక పత్రమైన  యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (UDHR) అనేది 1948లో ఆమోదించబడింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజల హక్కులు,  స్వేచ్ఛలను రక్షించడమే  ప్రధాన కారణంగా  ఐక్యరాజ్యసమితి స్థాపన జరిగింది.  అన్ని దేశాల ప్రజల హక్కుల సాధనకు ఒక "సామాన్య ప్రమాణం"గా  ఇది  రూపొందించబడింది. ఈ ప్రామాణిక పత్రం 500కి పైగా భాషలలోకి అనువాదమైంది. ఇది గౌరవం, స్వేచ్చ, సమానత్వం, సోదరతత్వం అనే నాలుగు స్థంబాల మీద  నిర్మితమైంది. ఇందులో 30 కీలకమైన అంశాలు ఉన్నాయి.


సాధాలణంగా ప్రజలకు ఉన్న హక్కులలో  స్వేచ్ఛగా జీవించే హక్కు,  భద్రత, వివక్ష లేకుండా సమానత్వం సాధించటం.  సమ న్యాయం. ఆలోచన, మత స్వేచ్ఛ.  విద్య,  పనికి సంబంధించిన హక్కులు.. మొదలైనవి ప్రధానంగా ఉంటాయి.

మానవ హక్కుల దినోత్సవం 2024 : థీమ్

సంవత్సరానికి ఒక ముఖ్య అంశాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని సాధించే దిశగా ప్రభుత్వాలు కార్యాచరణ చేపడతాయి. 2024కు గానూ.. "మన  హక్కులు, మన  భవిష్యత్తు, తక్షణమే". అనే థీమ్ రూపొందించబడింది.  దీనికి తగినట్టే..  మానవ హక్కులనేవి ప్రతీరోజూ, ప్రతీ చోటా ప్రజలని ఎంతలా  ప్రభావితం చేస్తాయో చూపిస్తుంది. మానవ హక్కుల్ని  కాపాడుకోవటం వల్ల సమాజం మీద స్పష్టమైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయనే విషయం చెప్తుంది.

మానవ హక్కుల దినోత్సవం ఎందుకు జరుపుకోవాలంటే..

 మానవ హక్కుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా  హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేసిన,  పోరాడిన వ్యక్తులను, వారి కృషిని గుర్తుచేస్తుంది. వారు చేపట్టిన  ఉద్యమాల స్ఫూర్తిని ప్రజలలో కూడా రగిలించి న్యాయపరంగా మన హక్కుల సాధన సాధ్యమేననే నమ్మకాన్ని కలిగిస్తుంది. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా  సమానత్వం, స్వేచ్ఛ,  వ్యక్తిగత గౌరవం యొక్క ప్రాముఖ్యతను పౌరులందరికీ  గుర్తుచేస్తుంది. ప్రతి ఒక్కరు సురక్షితంగా, వివక్షకు గురి కాకుండా ఉండే   ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రజలందరూ  కలిసి పనిచేసే దిశగా ప్రజలను  ప్రోత్సహిస్తుంది. రోజువారీ జీవితాల్లో మానవ హక్కుల కోసం నిలబడటంలో,  న్యాయం జరిగే సమాజాన్ని నిర్మించడంలో సహకరించడానికి ప్రజల  పాత్రన ఎంత అవసరమో గుర్తుచేస్తుంది.

మానవ హక్కుల పరిరక్షణ కోసం ఏం చేయాలి?

మానవ హక్కుల దినోత్సవంలో ప్రజలు  భాగమై వాటి పరిరక్షణ కోసం తమ  వంతు ప్రయత్నం   చేయాలనుకుంటే   మానవ హక్కులని ప్రోత్సహిస్తూ, అవగాహన పెంపొందిస్తూ, సామాజిక న్యాయం కోసం కృషి చేసే సంస్థలకు మద్దతు ఇవ్వవచ్చు.  మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాలి. మానవ హక్కుల ప్రాధాన్యత, వాటి వల్ల ప్రజలకు చేకూరే మేలు,  సమాజంలో ఏర్పడే మార్పుల గురించి చెప్పాలి.  వివక్ష,  అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి.  మానవ హక్కుల సాధన, సమాజిక న్యాయం అనేది  ప్రతి వ్యక్తి తనతోనే మొదలవ్వాలనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సమానత్వం, స్వేచ్ఛ కోసం జరుపుతున్న సమాజ  పోరాటంలో ఎవరూ వెనుకబడకుండా చూసుకోవడం అందరి బాధ్యత. అందుకు తగిన విధానాలను, విలువలని పాటించడం ద్వారా మానవ హక్కుల పరిరక్షణలో ప్రతి వ్యక్తి తన పాత్రను తాను సమర్థవంతంగా  నెరవేర్చవచ్చు.  వ్యక్తిగత హక్కులు కాపాడుకుంటూ, ఇతర హక్కుల్ని గౌరవిస్తూ ముందుకెళ్తే, ఒక మెరుగైన భవిష్యత్తును సృష్టించగలమనీ, సానుకూల మార్పును తీసుకురాగలమని స్పష్టంగా చెప్పవచ్చు.


                                               *రూపశ్రీ.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu