ఈ కాలంలో నీతి ఎలా ఉంది?? 


మనుషుల జీవితాలలోనూ, వారి మధ్య ఇమిడిపోయినవి కొన్ని ఉంటాయి. వాటిని మనం అనుబంధాలు, విలువలు, సెంటిమెంట్లు ఇట్లా బోలెడు రకాలుగా చెప్పుకుంటాం. ప్రతి మనిషికి కొన్ని లక్షణాలు ఉంటాయి, వాటి ఆధారంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అయితే ద్రవ పదార్థాలను ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలోకి ఒదిగిపోయినట్టు మనిషి కూడా ఒదిగిపోతూ ఉండటానికి ప్రయత్నం చేస్తుంటాడు. కొంతమంది ఇలాగే ఉండాలి అంటారు, మరికొందరు అలా ఉండకూడదు అంటారు. కానీ మొత్తానికి ఈ సమాజంలో మనిషి ఇట్లా ఉండాలి అని కొన్ని ఆపాదించారు. మనిషి వాటినే అంటిపెట్టుకుని, పాటిస్తూ ఉంటే వ్యక్తిత్వం అంటారు. అలా ఉంటేనే నీతిగల వాడు అని గుర్తిస్తారు. నిజానికి ఈ నీతి అంటే ఏమిటి?? ప్రస్తుత సమాజంలో నీతి ఎవరికి ఎంత వరకు తెలుసు.

చాలామంది మనిషి ఎట్లా ఉండాలి అని విషయం ప్రస్తావనకు వచ్చినపుడు చాణుక్యున్ని ఉదహరణగా చెబుతూ ఉంటారు. నిజమే కావచ్చు చాణుక్యుడు ఒక గొప్ప వ్యూహకర్త. అయితే ఆయన ఆలోచనలను, ఆయన సిద్ధాంతాలను పూర్తిగా తెలుసుకుంటేనే మనిషి దాన్ని గ్రహించగలుగుతాడు. లేకపోతే సగం సగం తెలిసిన జ్ఞానంతో తనకు నచ్చిదాన్ని, ఎక్కడో తన ప్రవర్తనను సమర్థించే నాలుగు వాక్యాలను పట్టుకుని వాటినే మననం చేసుకుంటూ వాటిలోనే నీతి మొత్తం ఉందని అందరికీ చెబుతూ బావిలోని కప్పలాగా ఉండిపోతాడు. 

కృష్ణ నీతి...

అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అందరూ చెప్పుకోవాల్సిన ఒక గొప్ప మనోవిజ్ఞాన స్వరూపుడు ఎవరన్నా ఉన్నారంటే అది శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు పాటించింది ఏమిటి?? మంచికి మంచి, చెడుకు చెడు, నీతికి నీతి, నమ్మినవాళ్లకు సహాయం చేయడం, ఏదైనా చిటికెలో తాను పరిష్కరించే నేర్పు ఉన్నా, తాను అందుబాటులో ఉన్న అదంతా తను చేసేయ్యక చుట్టూ ఉన్న అందరితో ఆ పనిని చేయించడం. ఆ ఫలితాన్ని వాళ్లే అనుభవించేలా చేయడం. డ్ఈని అర్థం ఏమిటి అంటే, ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలి. ఏదో శక్తి, సామర్త్యాలు ఉన్నాయి కదా అని ఇతరుల పనులను చేతుల్లోకి తీసుకుని దాన్ని చిటికెలో చేసిపెడితే అవతలి వాళ్లకి ఆ పని నైపుణ్యత అలవాటు కాదు. ప్రతి తల్లిదండ్రి పిల్లల విషయంలో పాటించాల్సిన ముఖ్య సూత్రం ఇదే. 

ఇక ప్రస్తుతం గురించి చెప్పుకుంటే

తన తరువాతే ఇతరం. విషయం ఏదైనా కావచ్చు మొదట తన అవసరం తీరాలి, తన సమస్యలు సద్దుమనగాలి ఆ తరువాత ఇతరుల గురించి ఆలోచిస్తారు. ఇతరుల కోణంలో ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు. నిజానికి తన గురించి తను చూసుకోవడం మంచిదే. తనని తాను నియంత్రించుకునేవాడు, తనని తాను చక్కబెట్టుకునేవాడు ఇతరులకు భారంగా మారడని ఒక నమ్మకం. అయితే చాలా చోట్ల ఒకే ఒక విషయంలో రివర్స్ కనబడుతుంది. అదే ఇతరుల్ని చూసి ఓర్వలేకపోవడం.

తన జీవితంలో సమస్యలు ఉన్నా లేకపోయినా ఇతరుల జీవితంలో సమస్యలు ఉంటే ఆనందపడిపోవడం. ఇది ఏ తాలూకూ ప్రవర్తన అంటే సాడిజం అని సులువుగా చెప్పేయచ్చు. ఇవ్వడమూ, తీసుకోవడమూ కాదు దోచుకోవడం నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఒకప్పుడు ఇతరులకు ఇవ్వడం అనే విషయం ఎంతో సంతోషంతో కూడుకుని ఉండేది, తీసుకోవడమూ అంతే సంతోషంతో ఉండేది. కానీ ఇప్పుడు ఆ రెండు పేర్ల ముసుగులో దోచుకోవడం అనే ప్రక్రియ ఎంతో దర్జాగా జరిగిపోతుంది. అది దోచుకోవడం అని అందరికీ తెలుసు కానీ ఎవరూ దాన్ని పల్లెత్తు మాట అనరు.

అది సమంజసమే అంటారు.

ఎందుకంటే దానివల్ల కలుగుతున్న ప్రయోజనం అలాంటిది. ఇంకా పిల్లలకు చెప్పే ఎన్నో నీతులు, విలువలు, నియమాలు, పద్ధతులు ఇవన్నీ కేవలం నీటి మాటలుగా ఉంటూ,  పెద్దలు విరుద్ధ మార్గాలు అనుసరిస్తూ పిల్లలకు ఒకానొక మార్గదర్శకులుగా మారుతున్నారు. ఈ నీతిని సరైన దిశలో మార్చాలంటే ప్రతి ఇంట్లో ఆ కృష్ణ నీతి, కృష్ణ వాక్కు వినబడాలి. భగవద్గీత అందరి ఇళ్లలో ఉండాలి. 


◆ వెంకటేష్ పువ్వాడ