బత్తాయి తోటను తగలబెట్టిన రైతులు..!

 

మరాఠ్వాడా ప్రాంతంలో వచ్చిన నీటి ఎద్దడి తీవ్రతను ప్రభుత్వం గుర్తించాలంటూ, అక్కడి రైతులు నాలుగు ఎకరాల బత్తాయి తోటను తగలబెట్టేశారు. ఔరంగాబాద్ లోని కోర్గావన్ ప్రాంతంలో నాలుగెకరాల విస్తీర్ణంలో ఉన్న దాదాపు 500 బత్తాయి చెట్లు ఈ అగ్నికి ఆహుతైపోయాయి. దేశానికి వెన్నెముక రైతేనని, కానీ రైతును పట్టించుకోవడంలో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా ఈ పని చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. షేట్కారీ అన్నదాత ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రైతులందరూ బత్తాయి తోటలో సమావేశమయ్యారు. ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జయాజీరావ్ సూర్యవంశీ మాట్లాడుతూ, 2012 నుంచీ మరాఠ్వాడా ప్రాంతాన్ని కరువు బాధిస్తోందని, వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఈ ఏడాది పరిస్థితి మరింత దిగజారిందని అన్నారు. హార్టీకల్చర్ లోని రైతులు, బ్యాంకుల రుణాలు ఎలా తీర్చాలో, నీరు లేకుండా తోటను ఎలా కాపాడుకోవాలో తెలియక చాలా ఆవేదన చెందుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో హార్టీకల్చర్ రైతులకు స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చిందని, ఇప్పుడు ఎన్టీయే కూడా అదే తరహాలో తమకు సాయం చేయాలని అందుకే ఇప్పుడు వేరే దారిలేక తోటల్ని అగ్నికి ఆహుతి చేస్తున్నామన్నారు. ప్రతీ ఏడాది కంటే, ఈ సారి మరాఠ్వాడా పరిస్థితి మరింతగా దిగజారింది. కరువు బాధిస్తుంటే, నీరు లేక ఇక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి ప్రత్యేక రైళ్లలో నీటిని పంపిస్తున్న సంగతి తెలిసిందే.