ప్రముఖ వైద్యులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
posted on Jul 25, 2020 5:17PM
ప్రముఖ డాక్టర్లతో టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పరిస్థితులు, వైరస్ నివారణకు తీసుకోవాల్సి న జాగ్రత్తలపై చర్చించారు. కరోనాపై అవగాహన అందరికీ అవసరమని పేర్కొన్నారు. కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఫ్రంట్‌లైన్ వారియర్ల త్యాగాలు, సేవలు వెలకట్టలేనివని చెప్పారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆగస్టు 15న చనిపోయిన ఫ్రంట్ లైన్ వారియర్లకు ఘనంగా నివాళులర్పిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
గత రెండు వారాల్లో ఏపీలో కరోనా వృద్ధి రేటు అత్యధికంగా ఉందన్నారు. మారణాల్లోనూ రెండవ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్ని అప్రమత్తం చేయటం తప్ప.. ప్రస్తుతానికి మందులు లేవని చంద్రబాబు పేర్కొన్నారు. అంబులెన్స్ లు, ఆస్పత్రుల్లో శానిటైజేషన్ ఎంతో ముఖ్యమని అన్నారు. ఎక్కువ మంది రోగులను ఒకే అంబులెన్స్‌లో తీసుకురావటమూ వ్యాధి వ్యాప్తికి మరింత కారణం అవుతోందని తెలిపారు. క్వారంటైన్ కేంద్రాల్లో తగు వసతులు ఉంటే రోగులు భయపడకుండా ఉంటారని పేర్కొన్నారు. కరోనా మృతులకు సరైన రీతిలో అంతిమ సంస్కారాలు జరగకపోవడం బాధాకరమన్నారు. ప్రజలకు వేరే ఏ అత్యవసర చికిత్స అవసరం అయినా, కరోనా పరీక్ష చేసి ఫలితాలు వచ్చేవరకు వైద్యం అందించడంలేదని చంద్రబాబు ఆరోపించారు.