మూసీ ప్రక్షాళనకు శ్రీకారం.. రియాల్టీలోకి రానున్న రేవంత్ అభీష్టం

వీకెండ్ లో మూసీ క్లీన్ వాటర్ లో బోటింగ్ కు వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. చుట్టూ గ్రీనరీ.. ఐకానిక్ టవర్లు.. సరికొత్తగా బ్రిడ్జిలు.. మధ్యలో బోటింగ్.. మన హైదరాబాద్ లో ఈ సీన్ ఊహించుకోవడానికే అద్భుతంగా ఉంది కదా.. మరి ఇది నిజమైతే ఎలా ఉంటుంది? మూసీ మురుగు, దుర్గంధం, ఇంకో వైపు పొల్యూషన్ ఇలా రకరకాల సమస్యల్లో ఉండే సగటు హైదరాబాదీకి ఫుల్ రిలాక్సేషన్ ఇవ్వడం పక్కా. అయితే అసాధ్యం అనుకున్న ఈ పనిని సుసాధ్యం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఇన్నాళ్లూ పేపర్ వర్క్ గా జరిగింది.. ఇప్పుడు రియాల్టీ కాబోతోంది. 
హైదరాబాద్ సిటీ నడి మధ్యలోనుంచి మూసీ వెళ్తుంది. గండిపేట్ వరకు ఓకే.. ఆ తర్వాతే మూసీ దుర్గంధభరితంగా మారుతుంది. సిటీలోకి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు మొత్తం 55 కిలోమీటర్లు మూసీ రివర్ ఉంటుంది. ఇదంతా బాగు పడితే ఒక అద్భుతమే అవుతుంది. భవిష్యత్ తరాలకు చాలా మేలు జరుగుతుంది. మూసీ నది ఓ సబర్మతిగా మారాలి. లండన్ థేమ్స్ మాదిరి వెలిగిపోవాలి. ఇలా జరగాలంటే మాటలు కాదు. పెద్ద ఎత్తున నిధులూ అవసరమే. వచ్చే నిధులతో మూసీకి అటు ఇటు బ్యూటిఫికేషన్ చేసి వదిలేస్తే సరిపోదు. అందులో ప్రవహించే నీళ్లు కూడా అద్భుతంగా ఉండాలి. అదే ఇప్పుడు వాస్తవంలోకి రాబోతోంది.

ఇన్నాళ్లూ జరిగిన పేపర్ వర్క్ ముగిసింది. ఇప్పుడు అసలు వర్క్ మొదలు కాబోతోంది. మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ 4,100 కోట్ల రూపాయల రుణాన్ని అందించబోతోంది. ఈ రుణంతో హైదరాబాద్ సిటీలో 55 కిలోమీటర్లు ప్రవహించే మూసీ నది పునరుజ్జీవనానికి ఉపయోగపడబోతోంది. ఈ ప్రాజెక్టు ఉద్దేశం సిటీని వరదలు లేని నగరంగా మార్చడం, మూసీ ఒడ్డున పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడం, నీటి కాలుష్యాన్ని తగ్గించడం వంటివి ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ లో 2,050 కోట్లను ఏడీబీ ఇవ్వబోతోంది. ఇక రెండో విడతలో మిగిలిన 2,050 కోట్లు ఇస్తారు. వీటితో నది శుద్ధి, కొత్త సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణం, ఆక్రమణల తొలగింపు, రివర్‌ఫ్రంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్  చేపడతారు. 

లండన్ థేమ్స్ మాదిరి, అహ్మదాబాద్ సబర్మతి మాదిరి హైదరాబాద్ మూసీని ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో సంకల్పించుకున్నారు. లండన్, సౌత్ కొరియా, జపాన్ సహా చాలా చోట్ల పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి నదులు ఎలా పునరుజ్జీవం అయ్యాయో గుర్తించారు. మన అవసరాలకు తగ్గట్లు మూసీని డెవలప్ చేయాలని నిర్ణయించారు. నిజానికి మూసీని బాగు చేయాలని గతంలో ఆలోచనలు చేసినా అవేవీ వర్కవుట్ కాలేదు. కేవలం అక్కడక్కడ బ్యూటిఫికేషన్ కు మాత్రమే పరిమితం అయ్యాయి.  నదిలో నీళ్లు బాగుండాలి. అంటే పరిశ్రమలు, గృహ వ్యర్థాలు అందులో కలవకూడదు. అప్పుడే మూసీ నీరు స్వచ్ఛంగా ఉంటుంది.  సో రేవంత్ రెడ్డి  అక్కడి నుంచే పనులు షురూ చేయబోతున్నారు. 

మూసీ నదిలో కలిసే మురుగునీటిని శుద్ధి చేయడానికి 39 కొత్త సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మిస్తారు. నది ఒడ్డున రైతు మార్కెట్‌లు, నైట్ మార్కెట్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లు, బోటింగ్ సౌకర్యాలు, రిలాక్సేషన్ జోన్లు ఏర్పాటు చేయడం వంటివి ఉంటాయి. నది నీటిని శుద్ధి చేసి రకరకాల అవసరాల కోసం వాడేలా ప్లాన్ చేస్తున్నారు. మొదటి దశలో ప్రాజెక్టు బాపూ ఘాట్ నుంచి  21 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి చేస్తారు. సింగపూర్‌కు చెందిన మీన్‌హార్డ్ గ్రూప్‌ను డీపీఆర్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం  నియమించింది. 

మూసీ పునరుజ్జీవం పట్టాలెక్కాలంటే  రాత్రికి రాత్రి అయ్యే పని కాదు. అందుకే సీఎం రేవంత్ మొదటగా ఏమేం చేస్తే వర్కవుట్ అవుతుందో అవన్నీ అమలు చేశారు. మొదట నదీ గర్భంలో ఉన్న వారిని ఇమీడియట్ గా ఖాళీ చేయించారు. వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించారు. సామాన్లు తరలించేందుకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేశారు. హైడ్రాతో చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ నుండి ఉస్మానియా హాస్పిటల్ దాకా ఆక్రమణలను తొలగించారు. మొదటి దశలో 13ఎస్టీపీలను నిర్మించడం ద్వారా రోజుకు 970 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తారు. రెండో దశలో మిగిలిన 34 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి కొనసాగుతుంది. ఇందులో పర్యాటక సౌకర్యాలు, వాణిజ్య కేంద్రాలు ఏర్పాటు అవుతాయి. 

సీఎం రేవంత్ రెడ్డి హెచ్‌ఎండీ అధికారులతో చేసిన రివ్యూలో ఇటీవలే కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ వరదలకు విముక్తి జరగాలంటే అది మూసీ పునరుజ్జీవంతోనే అని క్లారిఫికేషన్ ఇచ్చారు. మూసీ అభివృద్ధికి ఐకానిక్ డిజైన్‌ను ఎంచుకోనున్నారు. రివర్‌ఫ్రంట్ అభివృద్ధి చేసే విషయంలో సబర్మతి మోడల్‌ను ఫాలో కావాలన్నారు. మూసీ పరివాహకంలో ఉన్న వారికి సరైన పరిహారం అందించి.. మొత్తం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రలక్ష్యంగా పెట్టుకున్నారు. నిజంగా అది సాకారమైతే హైదరాబాద్ వాసులకు పండుగే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu