హ్యాకింగ్ భయం: తెలంగాణ సెక్రటేరియట్‌లో ఇంటర్నెట్ నిలిపివేత
posted on May 17, 2017 10:14AM

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ర్యాన్సమ్ వేర్ వైరస్ "వాన్నా క్రై" ఎఫెక్ట్ ప్రభుత్వాలకు సైతం నిద్రలేకుండా చేస్తోంది. అత్యంత రహస్య సమాచారాలను సేవ్ చేసి పెట్టి ఉండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతోందోనని ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ భయం తెలంగాణ ప్రభుత్వానికి పట్టుకుంది. వాన్నా క్రై వైరస్ సోకవచ్చన్న అనుమానంతో తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది ప్రభుత్వం. సచివాలయంలోని అత్యధిక కంప్యూటర్ల విండోస్ ఎక్స్ పీ సిస్టమ్ పైనే పనిచేస్తుండటం, ఇవన్నీ నెట్‌వర్క్, ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చెంది ఉండటంతో ముందు జాగ్రత్తగా నెట్‌ను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ నుంచి భద్రతాపరమైన క్లియరెన్స్ వచ్చిన తర్వాత దానిని ఇన్ స్టాల్ చేసి ఆపై ఇంటర్నెట్ సేవలను తిరిగి కొనసాగించే అవకాశం ఉంది.