షాకింగ్.. సాక్షి పత్రిక చందాదారుల డేటా కూడా చోరీ!!
posted on Mar 5, 2019 5:41PM

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డేటా చోరీ కేసు హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై స్పందించిన బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎవరి ఊహలకి అందని సంచలన విషయాన్నీ బయటపెట్టారు. అదేంటంటే.. ఐటీ గ్రిడ్ వద్ద ఉన్న ఏపీ ప్రజల సమాచారంలో వైసీపీ అధినేత జగన్ కి సంబంధించిన సాక్షి దినపత్రిక చందాదారుల వివరాలు కూడా ఉన్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన అలా వ్యాఖ్యలు చేసారో లేదో.. సాక్షి పత్రిక రీడర్లలో మెజారిటీ ప్రజలు వైసీపీ సానుభూతిపరులు, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే ఉంటారు. అందుకే వారి వివరాలు సేకరించి వారి ఓట్లు తొలగించారు అంటూ వైసీపీ శ్రేణులు విమర్శలు మొదలు పెట్టాయి. అంత బాగానే ఉంది కానీ.. డేటా చోరీ అయిందని కంప్లైంట్ ఇచ్చిన వైసీపీకి, దర్యాప్తు చేస్తున్న పోలీసులకి తెలియని విషయం.. జీవీఎల్ ఎలా తెలిసిందంటూ జనాలు బుర్ర బద్ధలయ్యేలా ఆలోచిస్తున్నారు. మరి జీవీఎల్.. సాక్షి రీడర్ల డేటా కూడా చోరీ అయిందన్న విషయం గురించి తనకి ఎలా తెలిసిందో మనకి చెప్తారో లేదో.