యూట్యూబ్ లో చూసి నకిలీ 2 వేల నోట్లు ముద్రించిన యువతి

 

టెక్నాలజీ పెరగడం వల్ల యువత టెక్నికల్ గా ఎంత అప్ డేట్ అవుతున్నారో తెలీదు కానీ.. క్రిమినల్ ఐడియాస్ లో మాత్రం బాగా డెవలప్ అవుతున్నారు. ఆమధ్య యూట్యూబ్ లో చూసి యువకులు బాంబు తయారు చేయడం నేర్చుకున్నారని తెలిసి షాక్ అయ్యాం. మరి ఇప్పుడు అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారుగా.. అందుకే ఆ యువకులకంటే నేనేం తక్కువ అంటూ ఓ యువతి ముందుకొచ్చింది. అయితే ఆమె బాంబు తయారుచేయలేదు. యూట్యూబ్ లో చూసి దొంగ నోట్లు ప్రింట్ చేయడం నేర్చుకుంది.

చెన్నై నగరంలోని మారియప్ప నగర్‌కు చెందిన భరణి కుమారి ఎంబీఏ పూర్తి చేసి ఇంటి వద్దనే ఖాళీగా ఉంటుంది. అయితే  కుంటుంబ ఇబ్బందుల కారణంగా ఇరుగు పొరుగు వారి వద్ద పెద్ద ఎత్తున అప్పులు చేసింది. కానీ వాటిని తీర్చలేకపోయింది. దీంతో అప్పులు ఇచ్చిన వారు.. భరణి కుమారిని అప్పు ఎప్పుడు తీరుస్తావు? ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో ఏం చేయాలో తెలియక.. భరణి కుమారి యూట్యూబ్‌లో చూసి దొంగ నోట్లు ప్రింట్ చేయడం నేర్చుకుంది. ఆ తరువాత ఇంట్లోనే దాదాపు రూ. లక్ష విలువ చేసే దొంగ నోట్లను ప్రింట్ చేసింది. అంతేకాదు వాటిని సమీపంలోని కడలూరులో అక్కడక్కడ మారుస్తూ వచ్చింది. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంది. ఎప్పటిలాగానే దొంగ నోటు పట్టుకొని షాపింగ్ కి వెళ్ళింది. కడలూరులోని ఓ దుకాణానికి వెళ్లి సామాన్లు కొన్న భరణి నకిలీ రెండు వేల రూపాయల నోటును దుకాణ యజమానికి ఇచ్చింది. ఆయన అందరిలాగా నోటుని పైపైన చూసి గల్లా పెట్టెలో వేసుకోలేదు. బాగా గమనించి చూసాడు. నోటు క్వాలీటిలో, అమ్మాయి చూపులో ఏదో తేడా కొడుతుందే అని అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల రాకతో బిత్తర పోయిన భరణి.. దగ్గరలోని బస్టాండ్‌కు వెళ్లి చిదంబరం వెళ్లే బస్సు ఎక్కి కూర్చుంది.  పోలీసులు బస్టాండ్‌ అంతా వెతికి బస్సులో ఉన్న భరణిని అరెస్ట్‌ చేసి విచారణ చేయగా.. అప్పుల భారం నుంచి తప్పించుకోవడానికే ఇలా దొంగ నోట్ల ముద్రణ ప్రారంభించినట్లు వెల్లడించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు భరణి ఇంటి నుండి.. నకిలీ రెండు వేల రూపాయల నోట్లను దాంతో పాటు ప్రింటర్‌‌ను స్వాధీనం చేసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu