చుట్టాలు తిరిగి వెళ్లడం లేదని..పోలీసులకు ఫిర్యాదు..!
posted on May 3, 2016 5:17PM

అతిథి దేవో భవ..! అన్న నానుడిని గౌరవించే సంస్కృతి మనది. ఇంటికి చుట్టాలు వస్తే వారిని గౌరవించి, తగిన మర్యాదలు చేయడం భారతీయుల రక్తంలోనే ఉంది. చుట్టాలు ఇంటికి వచ్చి రెండు రోజులో మూడు రోజులో ఉంటారు. కాని ఇక్కడ మాత్రం వచ్చి రోజులు గడుస్తున్నా తిరిగి వెళ్లడం లేదు. దీంతో విసిగిపోయిన ఒకాయన మాత్రం బంధువులతో విసిగిపోయాడు. ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి ఆర్‌ఎంస్ కాలనీలో నివాసం ఉండే విజయేందర్ రావు అనే మాజీ సైనికోద్యోగి ఇంటికి ఆయన మనవడు, మనవరాలు కుటుంబంతో పాటు వచ్చారు. అయితే వారు తిరిగి వెళ్లట్లేదు..ఎన్నిరోజులైనా వారు ఇల్లు కదలకపోవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసి.. వారిని తన ఇంటి నుంచి పంపించాలని తెలిపాడు. బంధువులను తిరిగి వారింటికి పంపించడం తన వల్ల కావడం లేదని, వారిపై కేసు నమోదు చేసి ఇంటి నుంచి పంపించాలంటూ పోలీసులకి మొరపెట్టుకున్నారు. తాను చేసిన ఫిర్యాదుకి పోలీసులు స్పందించకపోవడంతో రెండో సారి కూడా రక్షకభటులను కలిశాడు. అయితే దీనిపై ఎలా స్పందించాలో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు.