గుంతకల్లుని వారసులకి రాసిచ్చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
posted on Jun 18, 2025 2:23PM

ఉమ్మడి అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో ఆశించిన సీటు దక్కలేదని పార్టీతో పాటు జిల్లా కూడా మార్చిన ఈ మాజీ మంత్రి గత ఎన్నికల్లో చివరి నిముషంలో టీడీపీ టికెట్ దక్కించుకుని గెలిచారు. అయితే గెలిచిన కొంతకాలానికి ఆయన చుట్టుపు చూపుగా కూడా గుంతకల్లు వైపు చూడటం లేదంట. నియోజకవర్గంలో వ్యవహారాలన్నీ తన వందిమాగధులకు అప్పజెప్పి వెళ్లిపోయారంట.
జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రాయలసీమలోని వేరే నియోజకవర్గాలతో పోలిస్తే అక్కడ రాజకీయం ఎప్పుడూ సైలెంట్‌గా నడిచిపోతుంటుంది. గుంతకల్ నియోజకవర్గంలో కేవలం రెండు మున్సిపాలిటీలు, ఒక్క మండలం మాత్రమే ఉండడంతో పెద్దగా రాజకీయ హడావుడి కనిపించదు. ముందు నుంచి అక్కడ ఎమ్మెల్యేలు వివాదాలకు దూరమే.
2008లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడ్డ గుంతకల్లు రాష్ట్ర విభజన తర్వాత ఒకసారి టీడీపీ తరఫున జితేంద్ర గౌడ్, వైసీపీ నుంచి వెంకట్రామిరెడ్డి గెలిచారు. ఇద్దరూ కూడా ఎప్పుడూ పొలిటికల్‌గా పెద్దగా ఫోకస్ అవ్వలేదు. ఎవరిపైనా రాజకీయ ఆరోపణలు లేవు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రామిరెడ్డి పోటీలో నిలవగా టీడీపీ నుంచి అనేక తర్జనభర్జనల తర్వాత కర్నూలు జిల్లా వైసీపీ నుంచి దిగుమతి నేతను తెచ్చుకున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను గుంతకల్లు నుంచి పోటీలోకి దింపింది టీడీపీ. అప్పట్లో కర్నూలు జిల్లా ఆలూరు నుంచి గెలిచి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గుమ్మనూరుకు బెంజి కారు మంత్రి అన్న ట్యాగ్‌లైన్ కూడా ఉండేది. జిల్లా మారి వచ్చినా కూటమి హావా, అలాగే బీసీ కావడంతో గుమ్మానూరు జయరాం గుంతకల్లులో గెలవగలిగారు. గుంతకల్లు నియోజకవర్గం, గుమ్మనూరు జయరాం అప్పటి నుంచి వార్తల్లో నిలుస్తున్నారు.
జయరాం ఎమ్మెల్యే అయిన మొదట్లో అడపాదడపా నియోజకవర్గానికి వచ్చి వెళ్తూ.. ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలను నిర్వహిస్తుండేవారు. ఇప్పుడు అది కూడా లేకుండా నియోజకవర్గాన్ని పూర్తిగా పదిలేసి అక్కడ పెత్తనంం అంతా తన కొడుకు, తమ్ముళ్లకు రాసిచ్చేశారంట. అది టీడీపీ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లడంతో అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఆరా తీసే పనిలో పడిందంట. జిల్లా పార్టీ పరిశీలకులుగా ఉన్న కోవెలముడి రవీంద్ర దృష్టికి కూడా ఈ విషయాన్ని గుంతకల్లు టీడీపీ సీనియర్ నేతలు తీసుకెళ్లారంట.
పార్టీ కార్యక్రమమైనా, ప్రభుత్వ కార్యక్రమాలు అయినా కేవలం ఎమ్మెల్యే కుమారుడు గాని లేదా తమ్ముడు కానీ మాత్రమే హాజరవుతూ షాడో ఎమ్మెల్యేల్లా వ్యవహరిస్తున్నారంట. గుంతకల్లు మున్సిపాల్టీని తన తమ్ముడు నారాయణస్వామికి , గుత్తి మున్సిపాల్టీ, పామిడి మండలాలను తన కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్‌కు అప్పజెప్పిన గుమ్మనూరు జయరాం తన వ్యాపారాలు చూసుకుంటున్నారంట. ఆ క్రమంలో గుత్తితో పాటు పామిడి మండలంలో గుమ్మనూరు ఈశ్వర్ ఎలా చెబితే అలా నడుస్తోందంట. ఒక సందర్భంలో అతను పామిడి ఎంపీడీవో ఆఫీస్‌లోకి వెళ్లి ఎంపీడీఓ చైర్‌లో కూర్చోవడం పెద్ద వివాదానికి దారి తీసింది.
అంతే కాదు పామిడి మండలంలో ప్రవహించే పెన్నా నదిలో బహిరంగంగా పట్టపగలే అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్నాయి. అందులో మేజర్ షేర్ ఎమ్మెల్యే కుమారుడిదే అన్న ప్రచారం ఉంది. పెన్నా నదిలో ఇసుక తవ్వకాలపై టీడీపీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి స్వయంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు బహిరంగంగా వార్నింగ్ ఇవ్వడం అప్పట్లో కలకలం రేపింది. ఇసుక అక్రమ రవాణాపై కేసు కూడా నమోదైంది. అదేకాక భూకబ్జాలు, పేకాట, మట్కా మాఫియాను ఎమ్మెల్యే అనుచరులు నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దానిపై మీడియా ఫోకస్ చేస్తే సదరు జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడతారని ఎమ్మెల్యే వర్గీయులు బహిరంగంగా హెచ్చరించడం సంచలనం రేపింది.
ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఎమ్మెల్యే మాత్రం గుంతకల్లులో కాలు పెట్టకుండా తన పని తాను చూసుకుంటున్నారంట. గెలిపించిన కార్యకర్తలకు మొహం చూపియకుండా ఉండటంతో జిల్లా టీడీపీ అధ్యక్షుడు సాంబశివుడు యాదవ్ లాంటి పార్టీ సీనియర్ నేతలే పార్టీ కార్యక్రమలు నిర్వహించాల్సి వస్తోంది. ఏదైనా సమస్య చెప్పుకుందాం అంటే ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం పార్టీకి అతిపెద్ద మైనస్‌గా మారుతోందంటున్నారు. లోకల్‌గా ఉన్న నాయకుల్ని కాదని ఎక్కడ నుంచో దిగుమతి చేసుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని స్థానిక టీడీపీ సీనియర్లు వాపోతున్నారు.