తెలుగు రాష్ట్రాలలో పీకే పాలిటిక్స్.. ఎవరు దోస్త్.. ఎవరు దుష్మన్ ?

ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త మలుపులు తీసుకుంటోంది. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారు, ఎవరు ఎవరితో చేతులు కలుపుతారు, అనేది ఎవరికీ అంతు చిక్కని వింత రాజకీయంగా  కనిపిస్తోంది. గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అనేది నిన్నటివరకు, బీజేపీ- తెరాస సంబంధాలకు సంబదింఛి కాంగ్రెస్ ప్రయోగించిన స్లోగన్. అయితే, ఈరోజు అదే స్లోగన్ కొత్తగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్-తెరాసల మధ్య  బలపడుతున్న సంబంధ బాంధవ్యాలకు కూడా అతికినట్లు సరిపోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.  

బీజేపీ-తెరాస చీకటి సంబంధాలకు ఎలాగైతే ప్రత్యక్ష ఆధారాలు లేవో అలాగే, కాంగ్రెస్-తెరాస కొత్త ప్రేమకు కూడా, పెద్దగా ఆధారాలు లేవు. కాంగ్రెస్ సహా వివిధ పార్టీలకు చెందిన 12 మంది పెద్దల సభ సభ్యుల సస్పెన్షన్  కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ప్రాంగణంలో గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నాయి. పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుసరించవలసిన వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రతి రోజు సమావేశం కావడం గత ఒకటి రెండు సెషన్లగా ఆనవాయితీ వస్తోంది.అయితే ఇంతవరకు ఈ సమావేశాలకు ఎప్పుడు హాజరు కాని, తెరాస పార్లమెంటరీ పార్టీ తొలిసారిగా పాల్గొంది. తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవ రావు, మరో ఇద్దరు ఎంపీలు ధర్నా కార్యక్రమంలో పాల్గొనారు. కేశవ రావు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పక్కనచేరి ప్రేమగా ముచ్చట్లు చెప్పుకున్నారు. అందులోంచి, కాంగ్రెస్-తెరాస కొత్త స్నేహం కథ పుట్టుకొచ్చింది.  

కాంగ్రెస్ సారధ్యంలో సాగుతున్న అపోజిషన్ ఆందోళనకు ఇంతవరకు దూరంగా ఉండి బుధవారం  ఎంట్రీ ఇచ్చింది, ఒక్క తెరాస మాత్రామే కాదు, సస్పెండ్ అయిన సభ్యుల్లో ఇద్దరు తమ పార్టీ సభ్యులు ఉన్నా, సోమ మంగళ వారాలలో అపోజిషన్ ఆందోళనలకు దూరంగా ఉన్న తృణమూల్ కూడా  బుధవారం  ఎంట్రీ ఇచ్చింది. నిజానికి, పార్లమెంట్’లో జరిగే ఉమ్మడి ఆందోళనకు, రాష్ట్ర్లాలలో రాజకీయ శతృమిత్ర సంబంధాలకు ఎలాంటి సంబంధం లేదని, అక్కడ రాష్ట్రాలలో  కొట్టుకున్నా, తిట్టుకున్నా పార్లమెంట్’లో మాత్రం ఉమ్మడి శత్రువు (బీజేపీ)ను ఉమ్మడిగా ఎదుర్కుందామని, ఈ సమావేశాలకు నయకత్వం వహిస్తున్న రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే స్పష్టంగా చెప్పారు. అంటే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, అనేది ఖర్గే చెప్పిన , అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. 

ఢిల్లీ నుంచి ముంబై వెళితే, అసలు రాజకీయం అక్కడ కనిపిస్తుంది. దేశంలో బీజేపీకి ప్రత్యాన్మాయంగా బలమైన ఫ్రంట్’ను ఏర్పాటుచేసే ప్రయత్నాలలో ఉన్న, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మమతా బెనర్జీ ముంబై వెళ్లారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్’తో సమావేసమయ్యారు. ఆతర్వాత ఇద్దరు కల్సి మీడియా ముందుకు వచ్చి, ,గతంలో కాంగ్రెస్ సారధ్యంలో దేశాన్ని పదేళ్ళు పాలించిన యూపీఏ ఇక లేదు ...అని గంభీరంగా ప్రకటించారు. సో ..కాంగ్రెస్ సహా బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నటికీ తమ కొత్త కూటమి స్వాగతం పలుకుతోందని అన్నారు. అంటే, బీజేపే వ్యతిరేక కూటమి సారధ్యం నుంచి కాంగ్రెస్ పార్టీని పక్కకు తప్పించి, ఉమ్మడి నాయకత్వం పేరిట కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసి చక్రం తిప్పేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు, అని అర్థం చేసుకోవచ్చును. నిజానికి కొంచెం అటూ, ఇటూ తిప్పినా  ఆమె అదే విషయం చెప్పారు.  

అక్కడ కట్ చేసి తెలుగు రాష్ట్రలకు వస్తే, జాతీయ స్థాయిలో సాగుతున్న ఈ మొత్తం పొలిటికల్ డ్రామా సూత్రధారి, ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్, ఏపీలో అధికార వైసీపీతో ఇప్పటికే డీల్ కుద్రుచుకున్నారు. అ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడోనే మంత్రివర్గ సమావేశంలోనే ప్రకటించారు. . తెలంగాలో జగన్ రెడ్డి సోదరి, వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్ టీపీతో డీల్ కుదుర్చుకున్నారు. ఆ విషయం, మనసు విప్పి మాట్లాడే ‘ఆర్కే ఓపెన్ హార్ట్’ కార్యక్రమంలో షర్మిల స్వయంగా చెప్పారు. ఇప్పుడు తాజగాగా పీకే. కేసీఆర్ తో డీల్ కుదుర్చుకున్నారని అంటున్నారు ...అలాగే, కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకున్నా,కాంగ్రెస్’ను కూడా బీజేపే వ్యతిరేక కూటమిలోకి తెచ్చే ప్రయత్నాలు మాత్రం విరమించుకోలేదు. సో .. రెండు రోజుల్లో  కొలకటా టూ ఢిల్లీ టూ హైదరాబాద్ .. వయా  ముంబై .. సాగిన పొలిటికల్ జర్నీ ‘డాట్స్’ కలుపుకుంటే, అసలు బొమ్మ బయటకు వస్తుంది. ఇప్పటికిప్పుడు ఏమీ జరగక పోవచ్చును కానీ, చివరకు, ఎన్నికల నాటికి, బీజీపీ వ్యతిరేక పార్టీలు అన్నీ మమతా-పవార్ ఫ్రంట్ వైపు ర్యాలీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. 

అదే జరిగితే, తెరాస ఆ కూటమిలో చేరితే  కాంగ్రెస్ ఎటుంటుంది ? మమతా బెనర్జీ నాయకత్వాన్ని అంగీకరించి, బీజేపీ వ్యత్రిరేక కూటమిలో చేరుతుందా?  మరో కూటమిని ఏర్పాటు చేస్తుందా? ఏమి జరుగు తుంది? అదొక మిలయన్ డాలర్ల ప్రశ్న. తెలంగాణలో తెరాస తృణమూల్ కూటమిలో చేరితే కాంగ్రెస్ ఏమి చేస్తుంది, అనేది మరో  మిలయన్ డాలర్ల ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ ఐడెంటిటీని కాపాడుకునేందుకు థర్డ్ ఫ్రంట్’గా ఏర్పడినా, అల్టిమేట్’గా బీజేపీ వ్యతిరేక శక్తులు అన్నీ, అది కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, వైసీపీ అయినా  చివరకు  తెరాసనే  అయినా, చేరేది ఒకటే గూటికి అందులో  సందేహం లేదు.