గవర్నర్ నరసింహన్ త్వరలో ఇంటికేనా...?
posted on May 21, 2014 3:14PM

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ త్వరలో తన గవర్నర్ గిరీని కోల్పోబోతున్నారా? దేశంలో మారిన రాజకీయ పరిస్థితులు, పరిణామాలు చూస్తే ఈ అనుమానం వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గవర్నర్లను మోడీ బీజేపీ ప్రభుత్వం మార్చే అవకాశం వుందన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వెల్లడవుతున్నాయి. పైగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పదవీకాలం ఏనాడో ముగిసింది.
రాష్ట్ర విభజన పుణ్యమా అని ఆయనకి ఎక్స్ టెన్షన్ దొరికింది. అంతేకాకుండా ఆయనను జూన్ 2 నుంచి పుట్టబోయే రెండు రాష్ట్రాలకీ ఉమ్మడి గవర్నర్ని చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. పదవిలో నుంచి దిగిపోయే ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ఫైల్ మీద కూడ సంతకం చేసి మరీ దిగిపోయాడు. అయితే ఆ ఫైలు రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతే నరసింహన్ రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగుతారు.
అయితే ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నియమించిన నరసింహన్ గవర్నర్‌గా కొనసాగే అవకాశాలు తక్కువన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను డీల్ చేయాలంటే తమకు అనుకూలంగా వుండే, తమ వ్యూహాలకు అనుగుణంగా వ్యవహరించే వ్యక్తి ఈ రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా వుండే మంచిదని కొత్త ప్రభుత్వం ఆలోచించే అవకాశం వున్నందున నరసింహన్ ఇంకా ఎక్కువకాలం గవర్నర్‌గా కొనసాగే అవకాశాలు లేవని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.