చనిపోయిన మూడు నెలలకి ట్రాన్స్ఫర్ !

 

మన ప్రభుత్వ అధికారులు ఎంత సమర్ధవంతంగా పని చేస్తున్నారో తెలియచెప్పే ఘటన ఇది. ఏకంగా మూడు నెలల క్రితమే చనిపోయిన ఒక ఉద్యోగికి ట్రాన్స్‌ఫర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉద్యోగి చనిపోయి మూడు నెలలు గడుస్తున్నా తాజాగా జరిగిన బదిలీల్లో అధికారులు ఆమె పేరు కూడా చేర్చడం చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లా అధికారుల నిర్లక్ష్యం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. జిల్లాలోని గుర్రంకొండ మండలం మర్రిపాడులో పి.లక్ష్మి అనే ఆమె పంచాయతీ కార్యదర్శిగా పనిచేసేవారు. 

గత ఏప్రిల్‌ 11వ తేదీ రాత్రి స్వగ్రామం బి.కొత్తకోటకు కారులో వెళుతుండగా ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను బెంగళూరు ఆస్పత్రిలో చేర్చగా ఆమె చికిత్స పొందుతూ అదే నెల 16న మృతి చెందింది. అయితే అధికారులకు దీనిపై సమాచారం అందలేదో ? ఏమో మొన్న శనివారం విడుదల చేసిన బదిలీల జాబితాలో లక్ష్మి పేరు కూడా చేర్చారు. గుర్రంకొండ మండలం రేణిగుంట నుంచి అత్తూరుకు ఆమెను బదిలీ చేస్తున్నట్టుగా అందులో పేర్కొన్నారు. ఈ విషయమై స్థానిక ఎంపీడీవోను సంప్రదించాలని చూసిన మీడియాకి ఆయన అందుబాటులోకి రాలేదు.