చంద్రయాన్ - 2 ఆగిపోడానికి అసలు కారణం అదే ?

 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గత పదేళ్లుగా కఠోర శ్రమపడి రూపొందించిన చంద్రయాన్‌-2 ప్రయోగం సాంకేతిక కారణాల కారణంగా ఈ తెల్లవారుజామున వాయిదా పడింది. సోమవారం తెల్లవారుజామున 2.51 నిమిషాలకు తలపెట్టిన జీఎస్‌ఎల్‌వీ-3 ఎం–1 రాకెట్‌లో మూడో దశలో సాంకేతిక లోపం కారణంగా చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు. 

అయితే అంతకు ఐదు నిమిషాల ముందే ప్రయోగం ప్రత్యక్ష ప్రసారం ఆగిపోయింది. ఈ ప్రయోగాన్ని వీక్షించాలని అంత టీవీలకు అతుక్కుపోయి వేచిచూస్తున్న వారికీ లైవ్ ఆగిపోవడంతో ఏం జరిగిందో అనే సంశయంలో ఉండగానే ఈ వాయిదా ప్రకటన వెలువడింది. అయితే అసలు ఇంతకీ ఆ సాంకేతిక ఇబ్బంది ఏమిటి ? అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

రాకెట్‌లో అత్యంత కీలక దశగా ఉన్న మూడో దశలో క్రయోజనిక్‌ ఇంజిన్‌కు సంబంధింన బ్యాటరీలు చార్జ్‌ కాకపోవడంతో సాంకేతిక సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు క్రయోజనిక్‌లో ఉండే గ్యాస్‌ బాటిల్‌ లీకేజీ రావడం కూడా సాంకేతిక లోపానికి మరో కారణంగా గుర్తించారు. దీంతో ప్రస్తుతానికి ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో అధికారులు ప్రకటించారు. ఈ విధమైన సాంకేతిక లోపం గతంలో ఎన్నడూ జరిగిన దాఖలాలు లేవు. 

దీనిపై ఇస్రో శాస్త్రవేత్తలు ఎందుకు ఈ లోపం జరిగిందో దానిపై మీద విశ్లేసిస్తున్నారు. అయితే చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని సెప్టెంబర్‌ 9న నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. ఏ ఒక్క చిన్న సాంకేతిక సమస్యనూ ఈ విషయంలో తేలికగా తీసుకునే అవకాశం లేదని అంటున్నారు. 100 శాతం ఖచ్చితంగా ఉంటేనే ప్రయోగాన్ని నిర్వహిస్తామని అంటున్నారు. చూడాలి మరి మళ్ళీ ఎన్నాళ్ళకో ఈ చంద్రయాన్ కి విడుదల.