గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యి వరదలో మునిగారు!

గూగుల్ మ్యాప్స్ ను నమ్మి ముందుకు వెడితే గంగలో మునగక తప్పదని మరో సారి రుజువైంది. ఇటీవలి కాలంలో గూగుల్ మ్యాప్స్ ఆధారంగా వెడుతున్న వాహనదారులు దారి తప్పిన సంఘటనలూ, ప్రమాదాల బారిన పడిన ఘటనలూ తరచుగా జరుగుతున్నాయి. ఇటీవలే గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతూ వెళ్లి సగం నిర్మించిన బ్రిడ్జిపై నుంచి కారు కిందపడి మరణం సంభవించిన సంఘటన మరిచిపోకముందే దాదాపు అలాంటిదే మరో సంఘటన కేరళలో జరిగింది.  కేరళకు చెందిన జోసెఫ్ అనే వ్యక్తి గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతూ ప్రయాణం చేస్తూ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కొట్టాయం ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆ సమయంలో కొట్టాయంలోని కడుతురుత్తి రోడ్డుపై కారులో తన భార్యతో కలిసి వెడుతున్నారు.  వారు గమ్యస్థానం చేరడానికి పూర్తిగా  గూగుల్ మ్యాప్స్ పైనే ఆధారపడ్డారు. ఆ మ్యాప్స్ చూపుతున్న మార్గంలో డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన జోసెష్ నేరుగా వరద నీటిలోకి వెళ్లారు. తృటిలో ఘోర ప్రమాదం జరిగేదే. అయితే స్థానికులు గమనించి అప్రమత్తం చేయడంతో కారును ఆపారు. అయితే అప్పటికే జోసెఫ్ ప్రయాణిస్తున్న కారు ముందు భాగం వరద నీటిలో మునిగిపోయింది. స్థానికులు తక్షణమే స్పందించి జోసెఫ్ ను, ఆయన భార్యను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu