జీహెచ్ఎంసీలో లైసెన్స్ లేని కేబుళ్లన్నీ తీసేయండి : హైకోర్టు
posted on Aug 22, 2025 4:19PM
.webp)
హైదరాబాద్‌లో కేబుళ్ల తొలగింపు నేపథ్యంలో ఎయిర్ టెల్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్బంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక కీలక ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీలో లైసెన్స్ తీసుకున్న కేబుళ్లు తప్ప ఏవీ ఉంచొద్దని స్పష్టం చేసింది. ఇష్టానుసారంగా కేబుళ్లు ఏర్పాటు చేయటం ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడటమేనన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటంపై న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామంతాపూర్ ఘటనను ఆయన ప్రస్తావించారు.
పుట్టిన రోజే తండ్రికి తలకొరివి పెట్టిన బాలుడి ఘటనపై ఉద్వేగభరితంగా మాట్లాడారు. కేక్ కట్ చేయాల్సిన 9 ఏళ్ల బాలుడు తలకొరివి పెట్టడం కలచివేసిందని జస్టిస్ నగేశ్ భీమపాక అన్నారు. విద్యుత్ ప్రమాదంపై ఎవరికి వారే చేతులు దులిపేసుకుంటే ఎలా?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామంతాపూర్ లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా విద్యుత్ తీగలు తగిలి ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో హైదరాబాద్‌లో ఉపయోగం లేని కేబుల్, ఇంటర్నెట్ వైర్లు కట్ చేసిన విషయం తెలిసిందే.