తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి గ్యాస్ లీకేజి...
posted on Feb 3, 2020 12:59PM

కోనసీమలో మళ్లీ గ్యాస్ కలకలం రేగింది, అయితే ఈ సారి అంతా అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. కానీ, గ్యాస్ లీక్ అవుతూనే ఉండటంతో అంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాట్రేని కోన మండలం ఉప్పూడి గ్రామం గ్యాస్ గుప్పిట్లో చిక్కుకుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో డ్రిల్లింగ్ సైటు నుంచి ఆకస్మాతుగా భారీ శబ్ధంతో గ్యాస్ లీక్ కావడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. లీకేజీ కారణంగా ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు రెవెన్యూ సిబ్బందితో పాటు ఓ ఎన్ జీ సీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉప్పూడితో పాటు పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు. ఫైరింజన్ లను తెప్పించి తీవ్ర ఒత్తిడితో లీక్ అవుతున్న గ్యాస్ ను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరా నిలిపేశారు. గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు నర్సాపురం, రాజమహేంద్రవరం, తాటిపాక, విశాఖపట్నం నుంచి ప్రత్యేక నిపుణుల బృందాలను రప్పిస్తున్నట్లు ఆధికారులు చెబుతున్నారు.
మహిపాల చెరువు పల్లంకూరు వెళ్లే ప్రధాన రహదారికి సమీపంలోని ఉప్పూడి వద్ద అపార గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు ఓ ఎన్ జీ సీ అధికారులు 2006 లో గుర్తించారు. రెండేళ్ల క్రితం ఈ బావిని బీహెచ్ఈఎల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీకి అప్పగించారు. మూడు రోజుల నుంచి ఈ గ్యాస్ బావికి సంబంధించి బెల్ క్యాంప్ ఓపెన్ చేసి, పేరుకుపోయిన మురికిని హై ప్రెజర్ ద్వారా పంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గ్యాస్ ఒత్తిడి తీవ్రమైన ఉవ్వెత్తున భారీ శబ్దాలతో ఎగిసిపడింది. దీంతో అక్కడ పనిచేస్తున్న సాంకేతిక సిబ్బంది భయంతో పరుగులు తీశారు. కొన్ని గంటల పాటు గ్యాస్ భారీ ఒత్తిడితో ఎగదన్నడం వల్ల ఉప్పూడి పరిసర ప్రాంతాలన్నీ గ్యాస్ తో కలుషితమయ్యాయి. ముందు జాగ్రత్తగా కాట్రేనికోన మండలానికి విద్యుత్ సరఫరా నిలిపేశారు. డ్రిల్ సైట్ కు దగ్గరగా ఉన్న 70 కుటుంబాలతో పాటు సుమారు 2000కు పైగా జనాభా ఉన్న ఉప్పూడి గ్రామం మొత్తం ఖాళీ చేయించారు. లీకేజీ సమాచారం తెలియగానే ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కుమార్. ఆర్ డీ వో భవాని శంకర్, డిఎస్పీ మాసూంబాషా అక్కడకు చేరుకున్నారు. బాధితులను ప్రత్యేక బస్సుల్లో ఎక్కించి మహిపాల చెరువు లోని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఓ ఎన్ జి సి, బి హెచ్ ఇ ఎల్ ఆయిల్ అండ్ గ్యాస్ అధికారుల నిర్లక్ష్య ఫలితమే గ్యాస్ లీకేజీకి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనతో ఓ ఎన్ జీ సీ కి సంబంధం లేదని. 2016-17 ఈ బావిని బి హెచ్ ఈ ఎల్ యాజమాన్యానికి అప్పగించామని అధికారులు చెబుతున్నారు. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న గ్యాస్ వల్ల కళ్ళ మంటలు, దద్దుర్లు వస్తున్నాయని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.