ల్యాండ్ పూలింగ్ కు విశాఖ రైతుల తిరస్కరణ..!

పేదల గృహ నిర్మాణం పేరిట విశాఖపట్నం చుట్టుపక్కల భారీగా భూ సమీకరణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పది మండలాల పరిధిలో ఆరువేల ఎకరాలకు పైగా సమీకరించేందుకు జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. అయితే అక్కడ ప్రభుత్వ అవసరాల గురించి చెబుతున్నారే తప్ప భూములిచ్చేవారికి కలిగే ప్రయోజనం ఏంటో స్పష్టం చేయడం లేదు. రైతులకు చేకూరే లాభం ఏమిటో ఒక్క అధికారి కూడా వివరించటం లేదు. దీంతో భూ సమీకరణ కోసం నిర్వహిస్తున్న గ్రామ సభల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్వయంగా కలెక్టర్ వచ్చి ఏ రకమైన ప్రయోజనాలు కల్పిస్తారో వివరిస్తే తప్ప భూములు ఇవ్వబోమని రైతులు పట్టుపడుతున్నారు. 

పేదల గృహ నిర్మాణం కోసం ఒక్కో లబ్ధిదారునికి సెంటు చొప్పున భూమి పంపిణీ చేయాలనే లక్ష్యంతో విశాఖ జిల్లాలో పది మండలాల్లోని యాభై ఐదు గ్రామాల్లో 6116.5 ఎకరాలు సమీకరించటానికి అధికారులు నడుం బిగించారు. ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూములు అసైన్డ్ చేసిన భూములను టార్గెట్ చేశారు. వాటిలో సింహ భాగం అసైన్డ్ భూములే ఉన్నాయి. సుమారు 2552.33 ఎకరాలు గతంలో వివిధ సందర్భాల్లో రైతులకు సాగు చేసుకోవటానికి అప్పగించారు. వాటిని ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నారు. అసైన్డ్ చేసిన భూమిని వెనక్కి ఇస్తే ఎకరానికి తొమ్మిది వందల గజాలు అభివృద్ధి చేసిన భూమి ఇస్తామని అధికారులు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. పదేళ్లకు పైబడిన ఆక్రమిత ప్రభుత్వ భూమైతే 450 గజాలు, ఐదేళ్ళకు పైబడి పదేళ్ల లోపు ఆక్రమిత భూమి అయితే 250 గజాలు ఇస్తామని పేర్కొన్నారు. 

ఏ రైతైనా తనకు తగిన గ్యారెంటీ ఇస్తేనే వ్యవసాయ భూమి ఇస్తాడు, రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులను ఒప్పించి 33,000 ఎకరాలు సేకరించారు. అయితే ఇప్పుడు రాజధానిని అక్కడి నుంచి తరలిస్తామనడంతో ఆందోళన చేస్తున్నారు. అక్కడ భూములిచ్చిన రైతులకు ఏడాదికి 50,000 రూపాయల చొప్పున పదేళ్ల పాటు చెల్లించేందుకు అప్పటి ప్రభుత్వం అంగీకరించింది. అదే విధంగా రైతు కూలీలకు నెలకు 2500 చొప్పున పింఛన్ ఇచ్చింది. కానీ, ఇక్కడ ఎటువంటి లబ్ధి చేకూరుతుందో అధికారులు విస్పష్టంగా చెప్పడం లేదు. ఇప్పుడు రైతుల నుంచి సమీకరిస్తున్న అసైన్డ్ భూములన్నీ నగరానికి దూరంగా ఉన్న గ్రామాల్లోనే ఉన్నాయి. అక్కడ పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పిస్తే తప్ప లబ్ధిదారుడు అక్కడికి వెళ్లి గృహాలు నిర్మించుకోలేరు. 

విశాఖపట్టణంలో గృహ లబ్ధిదారులకు సంబంధించి కొంత చరిత్ర ఉంది. గత ప్రభుత్వాలు పేదల కోసం నగరాన్ని ఆనుకొని కొమ్మాది, పరదేశిపాలెం, మిథిలాపురి వుడా కాలనీ, మారికవలస, అగనంపూడి, చినముషిడివాడ తదితర ప్రాంతాల్లో గృహాలు నిర్మించి ఇచ్చారు. లబ్ధిదారుల్లో అత్యధికులు అక్కడికి వెళ్లలేదు, నగరంలో ఏదో ఒక పని చేసుకుని జీవనం సాగిస్తున్నామని, దూరంగా పంపించేస్తే రోజూ నగరంలోకి రాకపోకలు సాగించటానికే తమ కూలి డబ్బులు సరిపోతాయని చాలా మంది వెళ్లలేదు. కొంతమంది వాటిని అమ్మేసుకున్నారు, వాటిలో కొన్ని ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అంతకంటే దూరంగా భూములు సమీకరిస్తుంది. పైగా అక్కడ స్థలం మాత్రమే ఇస్తామని చెబుతోంది. గృహాలు పేదలే నిర్మించుకోవాలని స్పష్టం చేసింది. ఇదే విధానంతో ముందుకెళితే లబ్ధిదారుల్లో అత్యధికులు అక్కడికి వెళ్లి ఇళ్లు నిర్మించుకునే అవకాశం లేదు. వారికి అంత ఆర్థిక స్తోమత లేకపోవటం ఒక కారణమైతే అవి నగరానికి దూరంగా ఉండటం మరో కారణం. ఇది మళ్లీ దుర్వినియోగానికి దారితీసే అవకాశముంది, దళారులు రంగ ప్రవేశం చేసి వాటిని తక్కువ ధరకు ఎత్తుకుపోతారు. 

ప్రభుత్వం ఇప్పుడు సమీకరిస్తున్న భూములన్నీ ఒకే దగ్గర లేవు, వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. సుమారు 400 నుంచి 500 ఎకరాలు ఒక్క దగ్గర ఉంటే వాటిని టౌన్ షిప్ గా అభివృద్ధి చేస్తే అక్కడికి వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్ వచ్చి భూములకు ధర పెరుగుతోంది. అంతే తప్ప ఇరవై, ముప్పై ఎకరాలలో లేఅవుట్ వేసి పేదలకు సెంటు చొప్పున పంపిణీ చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశాలు చాలా తక్కువ. అలాంటప్పుడు అక్కడ భూములకు ధర పెరగదు. దానివల్ల భూములిచ్చిన రైతులకు ప్రయోజనం ఉండదు. వారు పొట్ట కొట్టినట్టే, దీనిని కూడా దృష్టిలో ఉంచుకొని చాలా మంది తమకు పరిహారం ఇంకా పెంచాలని, తమ భూముల్లో చెట్లు, ఫలసాయం, వ్యవసాయ పంపుసెట్ లు అన్నింటికీ పరిహారం ఇవ్వాలని అడుగుతున్నారు. అభివృద్ధి చేసిన భూమి కూడా ఇంకా ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu