పేకాట మాన్పించే మందులు వచ్చేస్తున్నాయి!

 

కొంతమందిని చూడండి! ఒక పద్ధతి అనుకుని దాని ప్రకారమే జీవించేస్తుంటారు. ఆ పద్ధతికి ఓ అడుగు అటూ ఇటూ ఒక్క అడుగైనా వేసేందుకు సిద్ధపడరు. మరికొందరు ఇందుకు పూర్తిగా భిన్నం. వాళ్ల తీరుని ఊహించడం కష్టం. మనిషి మనిషికీ మధ్య ఈ తేడాలేంటి. ఒకరు దూకుడుగా ఉంటే, మరికొందరు అతిజాగ్రత్తగా ఎందుకు ప్రవర్తిస్తారు? కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు, ఈ ప్రశ్నకి జవాబు కనుక్కొనే ప్రయత్నం చేశారు. ఈ జవాబు చాలా సమస్యలకి పరిష్కారం చూపుతుందని చెబుతున్నారు.

 

దూకుడుగానో, పద్ధతిగానో ప్రవర్తించే సమయంలో మన మెదడులో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో గమనించే ప్రయత్నం చేశారు శాస్త్రవేత్తలు. ఇందుకోసం కొన్ని ఎలుకలకి ల్యాబొరేటరీలో ఓ పరీక్ష పెట్టారు. వాటికి ఐపాడ్ మీద రెండు దృశ్యాలని చూపించారు. మొదటి దృశ్యాన్ని ఎలుక ముట్టుకున్నప్పుడు, దానికి వెంటనే ఓ స్వీట్ ఇచ్చారు. రెండో దృశ్యాన్ని ఎలుక ముట్టుకున్నప్పుడు కూడా దానికి స్వీట్ ఇచ్చేవారు... కాకపోతే అది ఇవ్వడంలో కాస్త అనిశ్చితి ఉండేది. అంటే స్వీట్ దక్కుతుంది కానీ... దాన్ని ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితిలో ఎలుకలు ఉండేవన్నమాట!

 

సహజంగానే కొన్నిరకాల ఎలుకలు వెంటనే స్వీట్ తినేందుకు ఇష్టపడి ఎప్పుడూ మొదటి దృశ్యాన్నే ఎన్నుకొనేవి. మిగతా ఎలుకలు స్వీట్ ఎప్పుడు దక్కినా ఫర్వాలేదు అనుకుంటూ రెండో దృశ్యాన్ని ఎన్నుకొనేవి. ఇలా అనిశ్చితికి సిద్ధంగా ఉండే ఎలుకలలోని మెదడు పనితీరు భిన్నంగా ఉన్నట్లు గ్రహించారు. వీరి మెదడులోని orbitofrontal cortex అనే వ్యవస్థ పనితీరు కాస్త నిదానంగా ఉంది. దాంతో ఎదుర్కోబోయే అనిశ్చితిని అవి ఊహించ లేకపోయాయి. ఇక అనిశ్చితికి సిద్ధపడే ఎలుకల మెదడులో gephyrin అనే ప్రొటీను కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్లు తేలింది.

 

మనిషికీ మనిషికీ మెదడులో ఉండే తేడాల వల్లే వారి ప్రవర్తనలో మార్పులు ఉంటాయని తేలిపోయింది. దాంతో మున్ముందు ప్రవర్తనకి సంబంధించి ఎలాంటి సమస్యనైనా మందులతో నివారించవచ్చని ఆశిస్తున్నారు. ఆటిజం వంటి అనేక సమస్యలకి ఈ మందుతో నివారణ సాధ్యమంటున్నారు. అంతేకాదు! పేకాట ఆడేవారిలో అనిశ్చితిని ఇష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇక నిరంతరం పద్ధతిగా ఉండాలనుకునేవారిలో చాదస్తం ఎక్కువగా కనిపిస్తుంది. Gephyrin ప్రొటీనులో మార్పులు తీసుకురావడం వల్ల పేకాట, చాదస్తంలాంటి సమస్యలని కూడా మందులతో నివారించవచ్చునట!

- నిర్జర.