ఉచితం లోగుట్టు.. ప్రలోభాలతో చెంపపెట్టు!

రాజకీయ పార్టీల ఉచిత హామీల బాగోతాన్ని ఒక హోటల్ ఒక్క రోజులో బయట పెట్టేసింది.  ప్రస్తుతం చెలామణిలో లేని ఐదు పైసల నాణేన్నితీసుకువస్తే తమ హోటల్ లో 35 రకాల వంటలతో శాఖాహార భోజనం ఉచితమని ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ తో జనం పెద్ద సంఖ్యలో రావడంతో.. సగం మందికి చెప్పిన ప్రకారం భోజనం వడ్డించి  మిగిలిన వారి నుంచి ముక్కు పిండి మరీ సగం డబ్బులు వసూలు చేసింది.

రాజకీయ పార్టీల ఉచిత హామీలదీ ఇదే తంతు. ఓట్లు దండు కోవడానికి అన్నీ ఉచితాలని ప్రకటించేసి పబ్బం గడిచాకా.. పన్నుల రూపంలో ఉచితాలను మించి వడ్డింపులు చేస్తారు. క్రమంగా ఉచితాలు మాయమైపోతాయి కానీ వడ్డించిన పన్నులు మాత్రం కడుతూనే ఉండాలి. ఇక ఉచితంగా షడ్రశోపేతమైన భోజనం అంటూ హడావుడి చేసిన హోటల్ విషయానికి వస్తే   ఏపీలోని ఓ రెస్టారెంట్ చెలామణిలో లేని   5 పైసల కాయిన్ తీసుకొస్తే రూ.400 విలువచేసే శాఖాహార భోజనం ఉచితంగా తినొచ్చని పేర్కొంది.  ఒకటి రెండు కాదు.. 35 రకాల వంటకాలను రుచి చూడొచ్చని బంపరాఫర్ ఇచ్చింది.

ఈ ఆఫర్ ఇచ్చింది విజయవాడలోని రాజ్ భోగ్ రెస్టారెంట్.  ఈ రోజుల్లో 5 పైసల కాయిన్స్ ఎవరి దగ్గర ఉంటాయిలే అనుకుంటే పొరపాటే. ఆ రెస్టారెంటుకు 5 పైసల కాయిన్స్ పట్టుకుని వచ్చిన వారిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇలా ఆఫర్ పెట్టారో లేదో.. అలా 5 పైసల కాయిన్స్ పట్టుకుని రెస్టారెంటుకు జనాలు ఎగబడ్డారు. ఇంత మంది  వస్తారని తాము ఊహించలేదని ఆ రెస్టారెంటు యజమాని మీడియాకు తెలిపారు. దాదాపు 300-400 మంది కస్టమర్లు వస్తారని తాము అనుకుంటే అంతకు రెట్టింపు కంటే ఎక్కువ మంది  వచ్చారని చెప్పారు.

మొదట వచ్చిన 50 మందికి మాత్రమే 5 పైసలకు భోజనం అందించామని, మిగతా వారికి సగం ధరకే అంటే.. రూ.200 భోజనం అందించామని చెప్పారు. అయినా తమ ఈ ఆఫర్ వల్ల హోటల్ కు మాత్రం గొప్ప పబ్లిసిటీ వచ్చిందని సంతోషపడ్డారు.  ఈ వివరణలోనే ఉచితాల వ్యవహారం ఏమిటో అర్ధమైపోతుంది.  రాజకీయ పార్టీలూ ఉచిత హామీలు గుప్పించేస్తూ ఓట్లకు గాలం వేస్తుంటారు. ఆ ఉచిత హామీలకు జనం మెస్మరైజ్ అయి ఓట్లు వేస్తుంటారు. అయితే ఆ ఉచితాల బాగోతం ఏమిటో జగన్  ఈ మూడున్నరేళ్ల కాలంలో జనానికి అర్ధమయ్యేలా చెబితే.. ఐదు పైసల కాయిన్ ఇస్తే ఉచిత భోజనం అంటూ ఇచ్చిన ఆఫర్ ఉచితాల బాగోతాన్ని ఒక్క రోజులోనే తేల్చేసింది.

ప్రజలను ఆకట్టుకోవడానికే ఉచిత హామీలు ఇస్తుంటాయి రాజకీయ పార్టీలు. పబ్బం గడవగానే వాటికి కోతలు పెట్టేస్తుంటారు. జగన్ రెడ్డి పాలనలో ఈ మూడున్నరేళ్ల కాలంలో చూస్తున్నదదే. విపక్ష నేతగా ఉండగా ఉచితం ఉచితం అంటూ నోటికొచ్చిన ప్రతి హామీని గుప్పించిన ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీల అమలు మాత్రం కోతలతో ఆరంభించి చివరకు ఎగనామం పెట్టే వరకూ వచ్చారు. అలాగే ఈ రెస్టారెంట్ పాపులర్ వావడానికి ఉచితం అన్న ఆయుధాన్ని వాడుకుంది. ఆ హోటల్ ప్రకటనను నమ్మి వచ్చిన వారిలో సగం మందికి ఉచితం హామీ ప్రకారం భోజనం అందించి... మిగిలిన వారిని సగం డబ్బులు చెల్లించి తింటే తినండి లేకపోతే మానండి అంది. ఇప్పుడు ఏపీలో జనం పరిస్థితి కూడా అలాగే ఉంది.