బీజేపీ నేతలకు అఖిలేష్ బంపర్ ఆఫర్

రాను రాను రాజు గుర్రం గాడిద అవుతోందనే నానుడి, అప్పుడు రాజరికం కాలంలో ఏమో కానీ, ఇప్పుడు, ప్రజాస్వామ్య యుగంలో నిజం అవుతోంది. భారతీయ జనత పార్టీ ( బీజేపీ) కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, గడచిన ఎనిమిదేళ్ళలో, ప్రజాసామ్య బద్దంగా, ప్రజలు ఎన్నుకున్న తొమ్మిది రాష్ట్ర  ప్రభుత్వాలను కూల్చి వేసిందని, ప్రతిపక్ష పార్టీలు పదే పదే ఆరోపిస్తుంటాయి. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా జోడీ ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అధికార పార్టీల ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొని, ఐటీ, ఈడీ, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి, భయపెట్టి, బ్లాకు మెయిల్ చేసి ఎమ్మెల్యేలను, దుర్మార్గంగా తమ వైపు తిప్పుకుంటున్నారని, ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి, కేసీఆర్ మొదలు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వరకు ప్రతిపక్ష పార్టీల నేతలంతా ప్రతి రోజు ఆరోపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో, శివసేన తిరుగుబాటు నాయకుడు షిండే బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేసీఆర్ ఇతర నాయకులు ‘షిండే’ నామ జపం చేస్తున్నారు.

షిండేను ఓ సింబల్ గా చూపించి, తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ నేపద్యంలోనే, మునుగోడు ఉప ఎన్నిక మధ్యలో ఫార్మ్ హౌస్ ఎపిసోడ్ ను తెరమీదకు తెచ్చారు. ఓ ముగ్గురు వ్యక్తులు తెరాస ఏమ్మేల్యలతో బేరసారాలు సాగిస్తున్న ఉదంతాన్ని కెమెరాలో బంధించి, తెరమీదకు తెచ్చి బీజేపీని దేశం ముందు దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ఉదందం పై ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి,విచారణ జరిపిస్తున్నారు. కోర్టులు, జైళ్లు, బెయిళ్ళు గా ఆ కథ నడుస్తోంది. 

మరోవంక  బీజేపీ జాతీయ నాయకులు తెరాస నాయకుల కొనుగోలుకు బేరసారాలు సాగిస్తున్నారంటూ  అందుకు సంబందించిన వీడియో, ఆడియో క్లిప్పింగ్స్, ఇతర ఆధారాలతో, ఓ నివేదకను తయారు చేసి, సుప్రీం కోర్టు, రాష్ట్రాల హై కోర్టుల న్యాయమూర్తులకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ప్రదాన రాజకీయ పార్టీల అధ్యక్షులు, దేశంలోని మీడియా సంస్థలు, మేథావులు, సామాజిక కార్యకర్తలు, ఒకరని కాదు కొన్ని వందల (?) మందికి పంపించారు. 

మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ నివేదికను యూపీ మాజీ ముఖ్యమంత్రి సమాజవాదీ పార్టీ నాయకుడు,అన్నిటినీ మించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంచి మిత్రుడు అఖిలేష్ కు పంపలేదా? ఎందుకంటే అఖిలేష్ యాదవ్ యూపీలో  ఎమ్మెల్యేల  క్రయవిక్రయయాలకు తాజాగా తెర తీశారు. యూపీ ఉప ముఖ్యమంత్రులు,కేశవ్ మౌర్య, బ్రిజేష్ పాథక్ లకు బ్రహ్మాండమైన ఉచిత బంపర్ ఆఫర్ ఇచ్చారు.ఇద్దరిలో ఎవరైనా సరే, బీజేపీని చీల్చి ఓ వంద మంది ఎమ్మెల్యేలను తమ వెంట తెచ్చుకుంటే  ముఖ్యమంత్రి కుర్చీ ఉచితంగా ఇచ్చేస్తామని బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చారు. 

 బీజేపీని చీల్చండి, ఓ వంద మంది మీ ఎమ్మెల్యేలను తెచ్చుకోండి, మా ఎమ్మెల్యేలు ఓ వందమందిని ఉచితంగా ఇచ్చేస్తాం... మీరే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి ... ముఖ్యమంత్రి కావాలనే మీ చిరకాల కోరికను తీర్చుకోండి..” అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.  అంతే కాదు, ఈ ఉచిత ఆఫర్ కు కాలపరిమితి కూడా లేదు. ఉప ముఖ్యమంత్రులు ‘ఎప్పుడు కావాలంటే  అప్పుడు, ముఖ్యమంత్రి కావచ్చని, బంతి వారి కోర్టులోనే ఉందని, అఖిలేష్ యాదవ్ స్ట్రెయిట్ గా ముఖ్యమంత్రి కుర్చీని ఎర వేశారు.

సరే,ఆ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అఖిలేష్ ఆఫర్  యాక్సెప్ట్ చేస్తారా? బీజేపీని ముక్కలు చేస్తారా,?అది అయ్యే పనేనా? తెలంగాణలో సిపిఐ సింగిల్ ఎమ్మెల్యే సహా  కాంగ్రెస్ ,టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలని కారెక్కించిన కేసీఆర్ ఎనిమిదేళ్ళలో బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కరిని అయినా ‘పట్టు’ కోలేక పోయారు. అలాంటిది. యూపీలో వందమంది బీజేపీ ఎమ్మెల్యేలకు వల వేయడం అయ్యే  పనేనా? అంటే, అదంతా వేరే చర్చ,కానీ, అఖిలేష యాదవ్ ఓపెన్ ఆఫర్  పై దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, జాతీయ పోరాటాలకు సిద్దమవుతున్న కేసీఆర్, ఎలా స్పందిస్తారు? ఈ విషయం దేశం తెలుసుకోవలనుకుంటోంది  అంటున్నారు, విశ్లేషకులు.