మీ వల్లే వరదలు.. మీ పరిహారం మాకొద్దు.. సజ్జలకు షాకిచ్చిన వరద బాధితులు 

ఆంధ్రప్రదేశ్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. వారం రోజులుగా కొన్ని గ్రామాలు ఇంకా వరదలోనే ఉన్నాయి. వరదలు కాస్త తగ్గుముఖం పడుతుండగానే నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక వరద సహాయక చర్యల్లో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. వరదల సమయంలో ఎవరూ తమకు అండగా నిలవలేదని, కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని బాధితులు మండిపడుతున్నారు. తీరిగ్గా ఇప్పుడు వెళుతున్న వైసీపీ ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు.

వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రులు, వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు జనాలు. తాజాగా సీఎం జగన్ అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి నిరసన సెగ తగిలింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సజ్జలను బాధితులు నిలదీశారు. భారీ వర్షాల కారణంగా  అన్నమయ్య జలాశయం కట్టతెగి ముంపునకు గురైన పులపుత్తూరు, మందపల్లి, తొగురుపేట, గుండ్లూరు గ్రామాల్లో సజ్జల  పర్యటించారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి ఆయనకు నిరసన వ్యక్తమైంది. వరదల్లో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని, ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏమూలకు సరిపోదని పులపుత్తూరు గ్రామస్థులు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

జస్టిస్ కనగరాజ్‌కు మళ్లీ పదవి.. మూడో పోస్టు అయినా ఉంటుందా?

వరదల సమయంలో ఎవరూ తమ దగ్గరకు రాలేదని, రెండు, మూడు రోజుల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వరదల్లోనో ఉన్నామని కొందరు బాధితులు ఆవేశంగా చెప్పారు. జరగాల్సిన నష్టం జరిగాకా ఇప్పుడొస్తే ఏం లాభమని మరికొందరు మండిపడ్డారు. వరద బాధితుల ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన సజ్జల.. వాళ్లన సముదాయించే ప్రయత్నం చేశారు. ఒక ఏడాదిలో నమోదు కావాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతోనే జలాశయాలు కట్టలు తెగి ప్రాణ, ఆస్తినష్టం జరిగిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. సర్వే చేసి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఇళ్లను పూర్తిగా కోల్పోయిన వారికి ఐదు సెంట్ల స్థలంలో ఇళ్లను నిర్మించి ఇస్తామని  హామీ ఇచ్చారు.