దళిత బంధు అటకెక్కినట్టేనా ? కేబినెట్ సమావేశంలో చర్చే లేదా? 

సోమవారం తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన సమస్యగా ఉన్న వరి కొనుగోళ్లు సహా ప్రభుత్వ పథకాలపై చర్చించింది. కేబినెట్ సమావేశంలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న దళిత బంధు పథకంపైనా చర్చ జరుగుతుందని అంతా భావించారు. రాష్ట్రంలోని దళితులంతా సీఎం కేసీఆర్ ప్రకటన కోసం ఎదురు చూశారు. నవంబర్ 4 నుంచి దళిత బంధు అమలు చేస్తామని ప్రకటించి దాన్ని మర్చిపోయారు  కేసీఆర్. నెల రోజుల ఆలస్యంగా డిసెంబర్ లోనైనా అమలు చేస్తారని భావించారు. కాని దళితుల ఆశలు అడియాశలయ్యాయి. మంత్రివర్గ సమావేశం ముగిశాకా మీడియాతో మాట్లాడిన కేసీఆర్ నోటి నుంచి దళిత బంధు అనే పదమే రాలేదు. దీంతో లక్షలాది మంది దళితులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

దళిత బంధు... హుజురాబాద్ ఉప ఎన్నిక ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త పథకం. దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల సాయం అందించే స్కీమ్ అది. పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ లో చేపట్టిన ప్రభుత్వం.. ఆ నియోజకవర్గంలోని దాదాపు 20 వేల కుటుంబాలను ఎంపిక చేసింది. వాళ్ల అకౌంట్లలో 10 లక్షల రూపాయల జమ చేసింది. కాని లబ్దిదారులకు అందించలేదు. నిధులు జమ చేసిన అకౌంట్లను ఫ్రీజ్ చేసింది ప్రభుత్వం. దీంతో తమ అకౌంట్లలో డబ్బులు ఉన్నాయని మురిసిపోవడమే హుజురాబాద్ దళితుల వంతైంది. ఎప్పుడెప్పుడు తాము ఎంపిక చేసుకున్న యూనిట్లను సర్కార్ అందిస్తుందా అని దళిత బంధు లబ్దిదారులు ఎదురు చూస్తున్నారు. 

హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు ఈ పథకాన్ని ప్రకటించడం వివాదాస్పదమైంది. ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ దళిత బంధు పేరుతో డ్రామా చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. హుజురాబాద్ లో దాదాపు 45 వేల దళిత ఓటర్లు ఉండటంతో.. వాళ్ల ఓట్లను గంపగుత్తగా కొట్టేసేందుకే ఈ స్కీమ్ తెచ్చారనే విమర్శలు వచ్చాయి. అయితే కేసీఆర్ మాత్రం దళిత బంధు హుజురాబాద్ కే పరిమితం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. ఇందు కోసం ఎంత ఖర్చైనా వెనుకాడేది లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల దళిత కుటుంబాలను ఉన్నాయని.. విడతల వారీగా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అంతేకాదు దళిత ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని ప్రకటించారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక కారణంగా  కొన్ని రోజుల పాటు దళిత బంధు అమలును ఎన్నికల సంఘం ఆపేసింది. దీంతో ఎన్నికల సంఘంపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు కేసీఆర్. దళిత బంధును ఆపేశారంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఎన్నికల సంఘం నవంబర్ 4వరకు మాత్రమే పథకాన్ని ఆపగలదని, తర్వాత దళిత బంధు ఇవ్వకుండా ఎవరూ బ్రేకులు వేస్తారని సవాల్ చేశారు. నవంబర్ 4 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని, తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలను ఎంపిక చేస్తామని తెలిపారు. హుజురాబాద్ తో పాటు ఖమ్మం, నాగర్ కర్నూల్, సూర్యాపేట, జుక్కల్ నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో దళితులందరికి 10 లక్షలు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

అయితే నవంబర్ 4వ తారీఖు ముగిసి నెల రోజులు కావొస్తోంది. కాని దళిత బంధు ఊసే ఎత్తడం లేదు కేసీఆర్ సర్కార్. నవంబర్ 4 తర్వాత పథకం అమలు కాకుండా ఎవరూ ఆపుతారే చూస్తానంటూ ప్రకటనలు చేసిన కేసీఆరే.. స్కీమ్ ను పట్టించుకోవడం మానేశారు. రోజులు గడుస్తున్నా దళిత బంధుపై ముందడుగు పడకపోవడంతో దళితులు ఆగ్రహంగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూ పంపిణి లాగే దళిత బంధు పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అటకెక్కించదనే విమర్శలు వస్తున్నాయి. ఇందుకు అనుగుణంగానే కేబినెట్ సమావేశంలో దళిత బంధు ప్రస్తావనే రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మంత్రివర్గ సమావేశంలో చర్చించలేదంటే దళిత బంధును ఆపేయాలని కేసీఆర్ నిర్ణయించారని అంటున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు దళిత సంఘాలు సిద్ధమవుతున్నాయి.