తెలంగాణలో 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలెర్ట్
posted on Aug 28, 2025 10:28AM

తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం (ఆగస్టు 27) కామారెడ్డిలో అతి భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరాన్ని నీరు ముంచెత్తింది. పలు కార్లు, ద్విచక్రవాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక శుక్రవారం (ఆగస్టు 28( కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. భారీ వర్షాల కారణంగా పది జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించే ముప్పు ఉందని హెచ్చరించింది.
ఇక పోతే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, భద్రాద్రికొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో వర్షాలు పెరిగితే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలాలని అధికారులు సూచిస్తున్నారు.