గండిపేటలో 12 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా

 

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని గంధంగూడ గ్రామంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడుతూ హైడ్రా  కీలక చర్యలు చేపట్టింది. సర్వే నంబర్ 43 పరిధిలో ఉన్న 12.17 ఎకరాల ప్రభుత్వ భూమి క్రమంగా కబ్జాలకు గురవుతోందన్న స్థానికుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైడ్రా స్పందించింది. భూమి ప్రభుత్వానికి చెందినదని నిర్ధారించిన అనంతరం శుక్రవారం ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎలాంటి అక్రమ ఆక్రమణలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంది.


గంధంగూడ గ్రామంలోని సర్వే నంబర్ 43లో మొత్తం 26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారిక రికార్డుల్లో ఉంది. ఇందులో గతంలో ప్రభుత్వం ఒక ఎకరాను విద్యుత్ సబ్‌స్టేషన్‌కు, మరో 9 ఎకరాలను జీహెచ్‌ఎంసీ చెత్త డంపింగ్ అవసరాల కోసం కేటాయించింది. ఈ కేటాయింపుల అనంతరం మిగిలిన భూమి క్రమంగా కబ్జా అవుతుందని స్థానికుల నుండి హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్  ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు సంబంధిత రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల అధికారుల తో కలిసి హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టింది. 

భూమి ప్రభు త్వా నిదేనని స్పష్టంగా నిర్ధారించిన తరువాత, వెంటనే చర్యలు తీసుకో వాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.ఆ ఆదేశాల మేరకు ఈరోజు శుక్రవారం 12.17 ఎకరాల భూమి చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ భూమిలో ఒక ఆలయం, ఒక మసీదు నిర్మాణం ఉండటంతో, వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మిగిలిన ప్రభుత్వ భూమిని రక్షించారు. అంతేకాకుండా, ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తెలియజేసేలా హైడ్రా బోర్డులను కూడా అక్కడ ఏర్పాటు చేశారు.

సుమారు రూ.1200 కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిని కాపాడడం ద్వారా హైడ్రా మరోసారి కబ్జాలపై తన కఠిన వైఖరిని చాటిందని అధికారులు తెలిపారు. ప్రజా ఆస్తుల రక్షణే లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతుందని, ఎక్కడైనా ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలు జరిగితే ప్రజలు వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. ఈ ఘటనతో గంధంగూడ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల రక్షణపై హైడ్రా చర్యలు చర్చనీయాంశంగా మారాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu