కవిత వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్లు

 

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వాడుతున్న వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్లు నమోదైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రోజు శాసన మండలికి హాజరైన సందర్భంగా కవిత ప్రయాణించిన వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు పరిశీలన చేపట్టగా, వరుసగా నిబంధ నల ఉల్లంఘనలు చేసినట్లు గుర్తించారు. కవిత ప్రయాణించిన మార్సిడీస్ బెంజ్ కారుపై 6 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఆమె వినియోగిస్తున్న మరో లగ్జరీ వాహనం లెక్సస్ 450డి (Lexus 450D)పై 16 ట్రాఫిక్ చలాన్లు నమోదై ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం మీద రెండు వాహనాలపై కలిపి 22 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ట్రాఫిక్ శాఖ రికార్డుల్లో నమోదైంది.

ఈ రెండు వాహనాలపై నమోదైన చలాన్ల విలువ మొత్తం రూ.17,770గా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఓవర్ స్పీడింగ్, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ వినియోగం వంటి ఉల్లంఘనలపై ఈ చలాన్లు విధించినట్లు అధికారులు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం, కవిత వాహనాలపై ఎక్కువగా నిజామాబాద్, కరీంనగర్, మెదక్, కామారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో ట్రాఫిక్ చలాన్లు నమోదయ్యాయి. ఆయా జిల్లాల్లోని ట్రాఫిక్ కెమెరాల ద్వారా ఉల్లంఘనలు గుర్తించి చలాన్లు జారీ చేసినట్లు సమాచారం.

ప్రజాప్రతినిధుల వాహనాలైనా సరే, ట్రాఫిక్ నిబంధనల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా సరే చలాన్లు తప్పవని ఈ ఘటన మరోసారి స్పష్టంగా చూపిస్తోంది. ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, ప్రజల్లోనూ విస్తృత స్పందన వ్యక్తమవుతోంది. ట్రాఫిక్ నియమాల పాటనపై ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతగా వ్యవహరించాలనే అభిప్రాయం వినిపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu