రూ.5లక్షల కోట్ల భారీ స్కామ్.. రేవంత్ పై కేటీఆర్ సంచలన ఆరోపణ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్ కు తెరలేపారంటే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం (నవంబర్ 21) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన  కేటీఆర్ హైదరాబాద్ నగరంలో పారిశ్రామిక భూముల రెగ్యులరైజేషన్ పేర రేవంత్  దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని భారీ స్కార్ కు రూపకల్పన చేశారని విమర్శించారు.

గతంలో తమ ప్రభుత్వం కనీసం 100 శాతం నుంచి అత్యధికంగా 200 శాతం ఎస్ఆర్‌ఓ రేట్లు చెల్లించాలని నిర్దేశించగా, కాంగ్రెస్ ఇప్పుడు కేవలం 30 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందంటూ కొత్త పాలసీని తీసుకువచ్చిందన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో భారీ స్కామ్‌కు ప్రణాళిక రూపొందించారన్నారు. ఈ విధానం ద్వారా   9,292 ఎకరాల భూమిని కేవలం 30 శాతం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చనీ, తద్వారా ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయానికి గండి పడుతుందని కేటీఆర్ అన్నారు.

 ఇప్పటికే ఆ భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి సోదరులు, అనచరులు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. అందుకే ఈఘమేఘాలమీద వారం రోజుల్లో దరఖాస్తులు, మరో వారంలో ఆమోదాలు, కేవలం 45 రోజుల్లో రెగ్యులరైజేషన్ అంటూ తొందరపడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.  ఈ పాలసీ కాంగ్రెస్ కు, ముఖ్యమంత్రి రేవంత్ కు ఏటీఎంగా మారిందన్నారు.  ఆ భూములు కొనుగోలు చేసినా.. క్రమబద్ధీకరణ చేసుకున్నా ఇండస్ట్రియలిస్టులకు భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.   ప్రజల ఆస్తిని కాపాడేందుకు బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తుందని చెప్పారు.  తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనీ, అప్పుడు   నగరంలోని పారిశ్రామిక భూముల లావాదేవీలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.  రేవంత్ రెడ్డి అవినీతికి అండగా నిలబడి  ఈ పాలసీలో భాగస్వాములై భవిష్యత్తులో ఇబ్బందులకు గురికావద్దంటూ  పారిశ్రామికవేత్తలకు  సూచించారు. 

ఇంకా ఫార్ములా ఈ కార్ కేసుపై మాట్లాడుతూ.. తనను అరెస్టు చేసే దమ్ము రేవంత్ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదనీ, అందుకే లైడిటెక్టర్ కు సైతం రెడీ అని సవాల్ విసిరాననీ చెప్పారు. ఇక పరువు కాపాడుకునేందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామా డ్రామాకు తెరతీశారని కాంగ్రెస్ పై మండి పడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ భావిస్తున్నారన్నారు. ఒక వేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినా స్థానిక ఎన్నికల తరువాతే ఉప ఎన్నికలు ఉంటాయని కేటీఆర్ జోస్యం చెప్పారు.  ప్రభుత్వం ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ కుప్పిగంతులు వేస్తోందని విమర్శించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu