బండి వర్సెస్ ఈటల.. తెలంగాణ బీజేపీలో చీలిక స్పష్టం!

తెలంగాణలో బీజేపీ ప్రస్థానం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం నేతల మధ్య సయోధ్య లేకపోవడమే.. సయోధ్య లేకపోవడం ఒక్కటే కాదు.. రాష్ట్ర పార్టీ నేతలలో విభేదాలు తరచూ బహిర్గతమౌతున్నాయి. అంతే కాదు.. ఈ  నేరుగా పేరు పెట్టి మరీ ఒకరినొకరు బహిరంగంగా విమర్శలకు దిగేంతగా ఈ విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి.  ఇంత కాలం తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ము లాటలు,నాయకుల మధ్య విభేదాలు, వివాదాలు  సాగుతూనే ఉన్నాయి. అయితే జూబ్లీ ఉప ఎన్నిక ఫలితం తరువాత అవి రచ్చెక్కాయి.   

రాష్ట్రంలో అధికారమే తరువాయి అన్న పరిస్థితి నుంచి జూబ్లీ ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా గల్లంతయ్యే పరిస్థితికి బీజేపీ దిగజారిపోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ రాష్ట్రనాయకుల మధ్య సయోధ్య లేమే అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? నాయకుల మధ్య విభేదాల వెనుక ఉన్న అసలు సిసలు రీజనేంటి? అని పరిశీలిస్తే..   సాధారణంగా బీజేపీలోకి బయట నుంచి వచ్చి చేరిన వారు ఇమడ లేరు. హిందుత్వ భావజాలం, ఆర్ఎస్ఎస్ బీజేపీకి మెంటార్ గా వ్యవహరించడం.. అన్నిటికీ మించి బీజేపీలోకి బయటి పార్టీలకు వచ్చిన వారిని తొలి నుంచీ పార్టీలో ఉన్నవారు మనస్ఫూర్తిగా కలుపుకునే పరిస్థితి లేకపోవడం సహజపరిణామం.  

అయితే బీజేపీ నాయకత్వం మోడీ, షా చేతులలోకి వచ్చిన తరువాత పార్టీలో ఆ పరిస్థితి మారిపోయింది. సిద్ధాంతం కంటే ఓట్లు, సీట్ల లెక్కలకే బీజేపీ హైకమాండ్ ప్రాధాన్యం ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా బీజేపీకీ ఇతర పార్టీలకీ, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కూ తేడా లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీలో తొలి నుంచి ఉన్నవారూ, తరువాత వచ్చి చేరిన వారి మధ్య అగాధం ఏర్పడింది. అది పెరుగుతూ వస్తోంది. మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఈ పరిస్థితి మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 

జూబ్లీ ఉప ఎన్నికలో ఘోర పరాజయం తరువాత ఈ విభేదాలు నివురు తొలగించుకుని నిప్పులా బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ల మధ్య సైద్ధాంతిక అంతరం ఈ విభేదాలు రాజీకి ఆస్కారం లేనంత తీవ్ర స్థాయికి చేరడానికి కారణమయ్యాయి.  బండి సంజయ్ నూటికి పదహారణాల హిందుత్వ వాది. ఈటల రాజేందర్ రాజకీయ నేపథ్యం ఇందుకు పూర్తి భిన్నం.  ప్రాణం ఉన్నంతవరకు హిందూత్వమే తన మార్గమని బండి సంజయ్ అంటే.. మతతవ్వం ఇక్కడ నడవదని ఈటల కుండబద్దలు కొడతారు.  బరాబర్ హిందుత్వ అజెండాతో  ఎన్నికలో పోటీ చేయడం కరెక్టు కాదంటారు. అలా పోటీ చేస్తే ఇదిగో ఇలా డిపాజిట్లు గల్లంతౌతాయని ఈటల ఎలాంటి శషబిషలూ లేకుండా కుండబద్దలు కొట్టేశారు. జూబ్లీలో బీజేపీకి డిపాజిట్ గల్లంతు కావడానికి హిందుత్వ అజెండాయే కారణమని విస్ఫష్టంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా ఈటల నేరుగా బండి సంజయ్ పేరు ప్రస్తావిస్తూ ఆయన మతతత్వ అతివాద ధోరణితో చేసిన ప్రచారమే జూబ్లీలో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు కావడానికి కారణమని చెప్పడమే కాకుండా, ప్రచార అజెండాలో మతం ప్రస్తావన లేకుండా ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేదని చెప్పారు. ఈ నేపథ్యంలో బండి వర్సెస్ ఈటల వ్యవహారం రాష్ట్ర పార్టీలో స్పష్టమైన చీలకను స్ఫురింప చేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu