శ్వేతపత్రం విడుదల చేయండి.. దట్సాల్
posted on Nov 14, 2014 4:28PM

మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ శాసనసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వానికి ఆయన చురకలు అంటిస్తున్నారు. తన మిత్రపక్షమని కూడా చూడకుండా టీఆర్ఎస్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. అక్బరుద్దీన్ శాసనసభలో మాట్లాడుతున్న తీరు చూసి అధికార పార్టీకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా వుండగా శుక్రవారం నాడు కూడా అక్బరుద్దీన్ అసెంబ్లీలో ఘాటు కామెంట్లు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్ మీద చర్చ సందర్భంగా అక్బర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే తెలంగాణ కోసం ఉద్యమం ఎందుకు చేశారా అనిపిస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం కోరానని చెప్పారు. అయితే, ఇంత వరకు సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్టానికి విద్యుత్ సమస్యలాగే ఆర్థిక సమస్య కూడా ఉందన్నారు. మరి ఆ సమస్యని ఎందుకు బహిర్గతం చేయడం లేదన్నారు. ప్రభుత్వం కొన్ని అంశాలను ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతోందని చెప్పారు. శ్వేతపత్రాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో చెప్పాలన్నారు.