ఈటల రాజేందర్ దూకుడు.. డీఎస్, అర్వింద్ తో చర్చలు 

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ దూకుడు పెంచారు. తన భవిష్యత్ కార్యాచరణలో భాగంగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ నేతలతో పాటు బీసీ సంఘాలతో వారం రోజుల పాటు మంతనాలు సాగించారు ఈటల రాజేందర్. ఇప్పుడు వివిధ పార్టీల నేతలను కలిసి చర్చిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను అన్ని పార్టీల నేతలను కలుస్తున్నానని, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్‌యూ లీడర్ల వరకూ అందరితోనూ చర్చిస్తానని చెప్పారు ఈటల రాజేందర్. మంగళవారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. భట్టీతో భేటీ కావడంతో ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది.  

తన కార్యాచరణలో భాగంగా రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌తో మాజీ మంత్రి ఈటల రాజేందర్​ బుధవారం భేటీ అయ్యారు. దాదాపు గంటన్నరకుపైగా ఇద్దరూ చర్చించారు. భవిష్యత్తు రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. రాజకీయ పరిణామాలపై త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఈటల ఈ సందర్భంగా వెల్లడించారు. తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేతలను కలిసి కోరుతున్నానని ఈటల రాజేందర్​ స్పష్టం చేశారు. డీఎస్‌తో భేటీ అయిన సమయంలోనే అక్కడకు వచ్చిన డీఎస్​ తనయుడు, బీజేపీ ఎంపీ అరవింద్‌ను కూడా ఈటల కలిశారు. దాదాపు 20 నిమిషాలు ఇద్దరూ మాట్లాడుకున్నారు. వీళ్లిద్దరి మధ్య రాజకీయ అంశాలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 

మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు ఈటల రాజేందర్. కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. దీంతో ఈటల కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జరిగింది. అదే సమయంలో కొత్త పార్టీ పెట్టరని.. ఇప్పుడున్న పార్టీల్లోనే ఏదో ఒక దాంట్లో చేరుతారనే వాదన వచ్చింది. అయితే తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇవ్వని రాజేందర్... ఇప్పుడు వివిధ పార్టీల నేతలను కలుస్తుండటం ఆసక్తి రేపుతోంది. ఈటల తాజా కదలికలను బట్టి... ఆయన కొత్త పార్టీ పెట్టకపోవచ్చనే అభిప్రాయమే రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.