ఆంద్ర ప్రదేశ్ లో యంసెట్ పరీక్షలు నేడే
posted on May 8, 2015 7:48AM
.jpg)
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఎంసెట్ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. ఉదయం 10 గంటల నుండి ప్రారంభం అయ్యే ఈ పరీక్షలకు మొత్తం 2,55,409 మంది హాజరవబోతున్నారు. వారిలో 1,70,685 మంది ఇంజనీరింగ్, 84, 274 మంది విద్యార్ధులు వైద్య మరియు వ్యవసాయ పరీక్షకు హాజరవుతున్నారని రాష్ట్ర మానవ వనరుల అబివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో 312 ఇంజనీరింగ్ పరీక్షా కేంద్రాలు, వైద్య మరియు వ్యవసాయ పరీక్షల వ్రాసేవారి కోసం 141 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. మరి కొద్ది సేపటిలో మొదలవబోయే ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షల కోసం కోడ్ ఎన్ -1 ఇంజినీరింగ్ ప్రశ్నాపత్రాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు కాకినాడ జేఎన్ టీయూలో ఎంపిక చేసారు. ఉదయం 10 గంటల నుండి ఇంజనీరింగ్ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుండి వైద్య, వ్యవసాయ పరీక్షలు నిర్వహించాబడుతాయి.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఎంసెట్ పరీక్షలకు హైదరాబాద్ లో విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకొన్నందున అక్కడ కూడా 16ఇంజనీరింగ్ పరీక్షా కేంద్రాలు, 22 వైద్య, వ్యసాయ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. హైదరాబాద్ లో మొత్తం 22758మంది విద్యార్ధులు ఎంసెట్ పరీక్షలు వ్రాస్తున్నారు.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడే ఈ పరీక్షలకు 350 మంది నిర్వహాకులుగా మరొక 150 మందిని పరిశీలకులుగా ప్రభుత్వం నియమించింది. ఎంసెట్ ప్రాధమిక ‘కీ’ ని ఈనెల 10న ప్రకటించి దానిపై అభ్యంతరాలను ఈ నెల 15వరకు స్వీకరిస్తారు. అనంతరం ఈ నెల 26న తుది ‘కీ’ ని ప్రకటిస్తారు. అదే రోజు ర్యాంకులను కూడా ప్రకటిస్తారు.
ఆర్టీసీ సమ్మె కారణంగా పరీక్షకు హాజరయ్యేందుకు విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ విజ్ఞప్తులను మన్నిస్తూ మానవతా దృక్పధంతో కొన్ని సంస్థలు మరియు గుంటూరులో ఆర్టీసీ ఉద్యోగులు బస్సులను నడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ డ్రైవర్లను తీసుకొని వారి ద్వారా పరీక్షా కేంద్రాలకు అనేక బస్సులను నడిపిస్తోంది.
ఆర్టీసీ సమ్మె కారణంగా సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోలేని విద్యార్ధులకు ఎటువంటి మినహాయింపు ఇవ్వబోమని మంత్రి స్పష్టం చేసారు. అవసరమయితే విద్యార్ధులు వారి తల్లి తండ్రులతో కలిసి ముందు రోజే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఆలశ్యమయిన విద్యార్ధులను పరీక్ష వ్రాసేందుకు అనుమతించబోమని ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు ప్రకటించారు. అయితే ఆర్టీసీ సమ్మె కారణంగా పరీక్షా కేంద్రాలకు ఆలశ్యంగా చేరుకొన్న దూర ప్రాంత విద్యార్ధులను పరీక్ష వ్రాసేందుకు అనుమతించే విషయంపై రీజినల్ కొ-ఆర్డినేటర్లకు విచక్షణాధికారాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. ఆలశ్యంగా వచ్చిన విద్యార్ధులు వారిని సంప్రదించినట్లయితే వారు తగిన నిర్ణయం తీసుకొంటారని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత మొట్టమొదటి సారిగా జరుగుతున్న ఎంసెట్ పరీక్షలకు ఆర్టీసీ సమ్మె దెబ్బ తగలడం చాలా దురదృష్టకరం.