ప్రత్యేక హోదా రాష్ట్రాభివృద్ధి కోసమా రాజకీయాల కోసమా?
posted on May 7, 2015 6:13PM
.jpg)
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో ఎందరు నేతలు మిగులుతారో ఎవరికీ తెలియదు. ఇక కీలకమయిన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అధికార పార్టీని నిలదీయకుండా రెండు నెలలు శలవు తీసుకొని విదేశాలకు వెళ్ళిపోయిన రాహుల్ గాంధీ నాలుగేళ్ల తరువాత జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో నరేంద్ర మోడీని డ్డీ కొంటారో లేక తను శల్యసారధ్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రధం మీద నుంచి ఉత్తర కుమారుడిలా దూకేసి మళ్ళీ విదేశాలకు పారిపోతారో తెలియదు. అసలు రెండు తెలుగు రాష్ట్రాలలో, దేశంలో కాంగ్రెస్ భవిష్యత్ గురించి ఊహించడమే కష్టంగా ఉంది.
కానీ బీజేపీని, దానితో జత కట్టిన తెదేపాని కూడా ఆంద్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రం నుండి తరిమి కొట్టేరోజు ఎంతో దూరంలో లేదని జోస్యం చెపుతున్నారు కాంగ్రెస్ యంపీ జేడీ శీలం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ ప్రజలను మోసం చేస్తుంటే, తెదేపా దానిపై ఒత్తిడి తేకుండా చేతులు ముడుచుకొని కూర్చోందని శీలం రెండు పార్టీల మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు హామీ ఇచ్చినప్పటికీ దానిని రాష్ర్ట పునర్విభజన చట్టంలో చేర్చకపోవడం వలననే ఇవ్వలేకపోతున్నామని వెంకయ్యనాయుడు చెప్పడాన్ని శీలం తప్పుపట్టారు. చట్టంలో చేర్చితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీ సిద్దమయితే అందుకు తమ పార్టీ కూడా సహకరిస్తుందని అన్నారు.
ప్రత్యేక హోదాపై ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే అది రాష్ట్రానికి లబ్ది చేకూర్చే అంశమా లేకపోతే రాజకీయ పార్టీలు ఒకదానినొకటి దెబ్బ తీసుకోవడానికి మాత్రమే పనికి వచ్చే అంశమా? అనే అనుమానం ప్రజలలో కలుగుతోంది. ఇదివరకు రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ సున్నితమయిన రాష్ట్ర విభజన అంశాన్ని అడ్డుపెట్టుకొని నాలుగు స్తంభాలాట ఆడాయి. అందులో అతి తెలివి ప్రదర్శించిన పార్టీలన్నీ ఓడిపోయాయి. అయినా మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా అనే మరో కొత్త ఆటకు సిద్దమయిపోయాయి. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయవలసిన రాజకీయ పార్టీలు వాటిని పట్టుకొని ఈవిధంగా ఆటలాడుకొంటున్నాయి. మరో నాలుగేళ్ల వరకు ఎవరూ అడ్డు చెప్పరు కనుక ఎన్ని ఆటలయినా ఆడుకోవచ్చును. అప్పుడు మళ్ళీ ప్రజలే ఏమి చేయాలో అది చేస్తారు.