రెండుసార్లు ఉరి తీయండి... కోయంబత్తూర్ కోర్టు

 

కోయంబత్తూరు మహిళా కోర్టు మహిళలపై అక్రమాలకు పాల్పడే మగాళ్లు భయపడేలా ఓ అరుదైన శిక్ష వేసింది. తనకు లొంగలేదనే కారణంతో ఓ మృగాడు కామంతో కళ్లు మూసుకుపోయి ఓ మహిళను దారుణంగా హతమార్చి ఆమె పిల్లలనూ హత్య చేశాడు. ఇప్పుడు ఆ మృగాడిని రెండు సార్లు ఉరి తీయండి అంటూ కోయంబత్తూరు కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. వివరాల ప్రకారం కోయంబత్తూరులోని గణపతి రామకృష్ణపురం రంగనాథన్ వీధికి చెందిన గృహిణి వత్సలాదేవి, కుమారులు మగిళన్, ప్రణీత్, భర్తతో కలిసి ఉంటున్నారు. తన ఇంటిలోని ఓ పోర్షన్ ను శివగంగై జిల్లా మానామధురైకి చెందిన సెంథిల్ (32)కు అద్దెకిచ్చారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో సెంథిల్ భార్య పుట్టింటికెళ్లిపోగా, వత్సలాదేవిపై సెంథిల్ కన్నేశాడు. అతడి దుర్బుద్ధిని గ్రహించిన వత్సలాదేవి అతడిని తన ఇంటి నుంచి ఖాళీ చేయించింది. అయినా బుద్దిమారని సెంధిల్ 2014 జూన్ 1న వత్సాలదేవిపై అత్యాచారం చేసి చంపాడు. ఆమెతో పాటు తన పిల్లలు ఇద్దరినీ కిరాతకంగా చంపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెంథిల్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు తుది విచారణ మంగళవారం జరిగింది. ఇద్దరు చిన్నారులను హతమార్చిన సదరు దుర్మార్గుడిని 'రెండు సార్లు' ఉరి తీయాలని న్యాయమూర్తి తన తీర్పు వెలువరించారు. ‘ఈ తీర్పుతో భవిష్యత్తులో ఈ తరహా నేరాలకు పాల్పడాలంటేనే మగాళ్లు బెంబేలెత్తాలి’’ అని న్యాయమూర్తి అన్నారు. ఇక నుండి ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడే మృగాళ్లందరికీ ఇలాంటి శిక్షలు వేస్తే మహిళలకు కొంత మేలు చేసినట్లవుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu