అవినాష్ కు ఊరట.. బుధవారం వరకూ నో అరెస్ట్

తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ పై సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పు బుధవారానికి వాయిదా పడింది. అంత వరకూ అవినాష్ ను అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు అదేశించింది. అంతకు ముందు వరుసగా రెండో రోజు అవినాష్  ముందస్తు బెయిలు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. అవినాష్ ను  కస్టోయిల్ విచారణ చేయాల్సిందేనని సీబీఐ అధికారులు విస్పష్టంగా చెప్పారు.  

గురువారం (మే26)ఇదే కేసులో అవినాష్ తరఫు న్యాయవాదులు, అలాగే సునీత తరఫు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు శుక్రవారం (మే27) సీబీఐ తరఫు వాదనలు వింది. ఈ సందర్భంగా కోర్టు సీబీఐ తీరు పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అవినాష్ ను ఇన్నాళ్లూ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. కనీసం ఆయన ఫోన్ ను కూడా ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీసింది. ఆ ప్రశ్నలన్నిటికీ సీబీఐ తరఫు న్యాయవాదులు సమాధానాలు ఇచ్చారు. చివరికి తీర్పు బుధవారం వెలువరించనున్నట్లు కోర్టు చెప్పింది. అయితే బుధవారం అవినాష్ ను విచారణకు పిలుస్తామని సీబీఐ తరఫు న్యాయవాదులు పేర్కొనగా, అందుకు అవినాష్ తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. తల్లి ఆస్పత్రిలో ఉన్నందున ఆయన రాలేరని పేర్కొన్నారు.

దీంతో కోర్టు తుది తీర్పును బుధవారం వెలువరిస్తామని పేర్కొంటూ అంత వరకూ అవినాష్ ను అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. మొత్తం మీద కోర్టు తీర్పు అవినాష్ రెడ్డికి అనుకూలంగానే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో అవినాష్ రెడ్డి సీబీఐకి రాసిన లేఖలో కూడా మే 27(శనివారం) తరువాత సీబీఐ ఎప్పుడు రమ్మంటే అప్పుడు విచారణకు వస్తానని పేర్కొన్నారు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఆయన (బుధవారం) మే 31 వరకూ విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ రోజు ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు వెలవరించనుంది. ఏది ఏమైనా ఈ ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ సందర్భంగా పలు కీలక, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో సీఎం జగన్ పేరు ప్రస్తావనకు వచ్చింది.

వివేకా హత్య విషయం అవినాష్ ద్వారా జగన్ కు ప్రపంచానికి తెలియడానికి ముందే తెలుసునని తమ విచారణలో వెల్లడైందనీ, దానిని నిర్ధారించుకోవాలంటే అవినాష్ ను అరెస్టు చేసి విచారించాల్సిందేనని సీబీఐ విస్పష్టంగా పేర్కొంది. అలాగే హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందనీ, హత్య జరిగిన వెంటనే అవినాష్ వాట్సాప్ కాల్స్ చేశారనీ నిర్ధారణ అయ్యిందనీ, ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకోవాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. ఆ సమయంలో కోర్టు జోక్యం చేసుకుని ఇంత కాలం అవినాష్ ఫోన్ స్వాధీనం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించింది. చివరకు అవినాష్ బెయిలు పిటిషన్ పై తీర్పు బుధవారం(మే31)కి వాయిదా వేసింది.